నదుల అనుసంధానంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ అన్నారు. 'కావేరి పిలుపు' పేరుతో ఆయన చేపట్టిన యాత్ర తమిళనాడు నాగపట్నంలో ముగిసింది. అనంతరం చెన్నైలో బహిరంగ సభ నిర్వహించారు.
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన 'కావేరి పిలుపు' యాత్ర తమిళనాడులో ముగిసింది. కావేరీ నదీ తీర పరిరక్షణ లక్ష్యంతో 3,500 కిలోమీటర్ల మేర బైక్ యాత్ర నిర్వహించారు.
కర్నాటకలోని పశ్చిమ కనుమలలో నదీ జన్మస్థలం 'తల కావేరి' నుంచి బంగాళాఖాతంలో కలిసే తమిళనాడులోని నాగపట్టణం వరకు ఈ బైక్ యాత్రను నిర్వహించారు.
ప్రముఖుల హాజరు
యాత్ర ముగింపు అనంతరం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నటి సుహాసిని పాల్గొన్నారు. 'కావేరి పిలుపు' పేరుతో జగ్గీ వాసుదేవ్ చేపట్టిన కార్యక్రమాన్ని అందరూ ప్రశంసించారు.
కావేరీ- గోదావరి నదుల అనుసంధానంపై గవర్నర్ ప్రసంగించారు. అనుసంధానం జరిగితే సముద్రంలో వృథాగా పోతున్న జలాలను వినియోగించుకోవచ్చని తెలిపారు.