జమ్ముకశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యలతో ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎలాంటి అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా ముందుజాగ్రత్తగా.. కశ్మీర్లో కీలక నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక... రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహనిర్బంధం చేశారు పోలీసులు.
తమ ఇళ్లనుంచి బయటకు అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు.. తమను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేత ఉస్మాన్ మజీద్, సీపీఐ ఎమ్మెల్యే తరిగామి. అయితే.. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది.
దేవుడికే తెలుసు...
తనను గృహనిర్బంధం చేసిన అనంతరం.. కేంద్ర ప్రభుత్వ చర్యలపై విరుచుకుపడ్డారు ముఫ్తీ. వరుస ట్వీట్లు చేశారు. గృహనిర్బంధంతో మాట్లాడే వారి నోళ్లు మూయించాలని చూస్తున్నారని.. అయితే ఇదంతా ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు. 'రేపు ఏం జరుగుతుందో.. దేవుడికే తెలుసంటూ' మరో ట్వీట్ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.