వైరల్: జనాల మధ్య హుందాగా నడిచిన చిరుత జనావాసాల్లోకి చిరుత చొరబడిన ఘటనలు ఇటీవల చాలా చూశాం. జనాలను చూసి చిరుత, చిరుతను చూసి జనాలు భయానికి గురై గందరగోళ పరిస్థితులు నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ జమ్ముకశ్మీర్ కిశ్త్వార్ జిల్లా చింగమ్ గ్రామంలో అలా జరగలేదు. రహదారిపై జనాల మధ్య హుందాగా నడుటుకుంటూ వెళ్లిందో చిరుత. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దారిలో పదుల సంఖ్యలో వాహనాలు, ప్రయాణికులు ఉన్నప్పటికీ వారిని పట్టించుకోకుండా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లింది. దానిని వెంబడిస్తూ కొంతమంది యువకులు వీడియో తీశారు. అయినా వారిని ఏమీ అనకుండా ముందుకు సాగింది చిరుత.
సమాచారం అందుకున్న వన్యప్రాణి సంరక్షణ అధికారులు చిరుతను పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిరుత అనారోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
అడవుల శాతం తగ్గిపోవటం వల్లనే ఇలా రోడ్లు, జనావాసాల్లోకి వన్యప్రాణులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పడు ప్రయాణికులు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: రౌడీ యువతి: యువకుడిని రాడ్డుతో ఇలా కొట్టింది!