దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీర జవాన్లకు తామంతా మద్దుతుగా ఉంటామని చాటి చెప్పేందుకు నెల రోజుల పాటు ప్రార్థనా కార్యక్రమం చేపట్టారు జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంత ప్రజలు. సాంబా జిల్లా పాలౌర గ్రామంలో ఫిబ్రవరి 2న ఈ కార్యక్రమం ప్రారంభించారు. మార్చి 3 వరకు కొనసాగనుంది.
పుల్వామా ఉగ్రదాడికి గుర్తుగా
పుల్వామా అమరులకు నెలరోజుల పాటు పార్థనలు
గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు నివాళిగా జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంత ప్రజలు నెలరోజుల పాటు ప్రార్థన కార్యక్రమం చేపట్టారు. అఖండ జ్యోతిని వెలిగించి ఫిబ్రవరి 2న దీన్ని ప్రారంభించారు. బలగాలకు తాము మద్దతుగా ఉంటామని దాయాది దేశానికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కశ్మీర్ ప్రజలు స్పష్టం చేశారు.
గతేడాది పుల్వామా దాడిలో మరణించిన జవాన్లకు నివాళిగా అఖండ జ్యోతిని వెలిగించి వందలాది మంది స్థానికులు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సమీప గ్రామాల్లోని ప్రజలూ మద్దతు తెలిపారు. తామంతా బలగాలకు మద్ధతుగా ఉంటామని... శత్రువుల దుర్మార్గపు ఆలోచనలకు విజయం దక్కనివ్వమని పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్థానిక యువత తెలిపారు.
పాలౌర గ్రామంలో ఓ టెంట్ ఏర్పాటు చేసి.. పుల్వామా ఘటనలో మరణించిన జవాన్ల బ్యానర్ ప్రదర్శించి కొంత మంది రోజూ ఉపవాసం ఉంటున్నారు. దేశభక్తి గేయాలను వింటున్నారు. ఈ గ్రామంలోని 90 శాతం మంది యువత సైన్యంలోనే సేవలందిస్తున్నారని స్థానికులు చెప్పారు.