అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు నెటిజన్లు ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఇవాంకతో తాము కూడా ఫొటో దిగినట్లు ఎడిట్ చేసిన చిత్రాలను కొందరు పోస్ట్ చేశారు. వీటిపై తాజాగా స్పందించారు ఇవాంక. భారత్‌లో తనకు అనేకమంది స్నేహితులయ్యారని పేర్కొంటూ ఆయా పోస్టులను రీట్వీట్ చేశారు.
ఇవాంకను తాజ్ తీసుకెళ్లిన దిల్జీత్..
తాజ్‌మహల్ వద్ద ఇవాంక ట్రంప్‌తో తాను ఫొటో దిగినట్లు 'ఉడ్తా పంజాబ్' చిత్రం ఫేమ్ దిల్జీత్ దోసాంజె ఫొటోషాప్ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. తాజ్ మహల్ వద్దకు తీసుకెళ్లాలని ఇవాంక పట్టుబట్టిన కారణంగా చారిత్రక కట్టడం వద్దకు వెళ్లినట్లు వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించారు ఇవాంక. తనను తాజ్ వద్దకు తీసుకెళ్లినందుకు దిల్జీత్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తన పోస్ట్‌కు స్పందించినందుకు ఇవాంకకు ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పాడు దిల్జీత్. ఈసారి భారత్‌కు వస్తే లూథియానాకు రావాలని ఆహ్వానించాడు.