తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశం, రాజ్యాంగం రక్షణ కోసం కాంగ్రెస్​ రాజీలేని పోరు'

మోదీ-షా ద్వయం భారతదేశం ఆత్మను చంపేస్తోందని ఆరోపించింది కాంగ్రెస్. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్ బచావ్ ర్యాలీ నిర్వహించిన ఆ పార్టీ.. ఆర్థిక వ్యవస్థతో పాటు రాజ్యాంగాన్ని కూడా భాజపా ఖూనీ చేస్తోందని దుయ్యబట్టింది. దేశంలో అన్యాయానికి గురయ్యే ప్రతి ఒక్కరి పక్షాన కాంగ్రెస్ ఉంటుందని భరోసా ఇచ్చింది.  ఆ పార్టీ అగ్ర నాయకత్వం.. భారత రాజ్యాంగ పరిరక్షణకు తుదిశ్వాస వరకు పోరాడతామని ప్రతినబూనింది. దేశ ప్రజలు కూడా మోదీ మాటలతో మోసపోకుండా.. భాజపా సర్కారు అన్యాయాలపై గళం విప్పాలని పిలుపునిచ్చింది.

Sonia Gandhi
'భాజపా సర్కారు అన్యాయాలపై గళం విప్పాలి'

By

Published : Dec 14, 2019, 4:49 PM IST

Updated : Dec 14, 2019, 10:14 PM IST

'దేశం, రాజ్యాంగం రక్షణ కోసం కాంగ్రెస్​ రాజీలేని పోరు'

ప్రజలంతా ఏకమై... దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ఉద్ఘాటించింది. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తుది శ్వాస వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రతినబూనింది. భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దిల్లీ రామ్​ లీలా మైదానంలో 'భారత్​ బచావో' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్.

మోదీ ఆరేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. భాజపా అస్తవ్యస్త పాలన కారణంగా దేశ ప్రగతి కుంటుపడిందని ఆరోపించారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు.

"మోదీ సర్కార్‌కు పార్లమెంటు పట్టదు. రాజ్యాంగ సంస్థలంటే లెక్కలేదు. మోదీ- షా సర్కార్‌కు రాజకీయం తప్ప.. వేరే ఇంకేదీ పట్టదు. ప్రజల మధ్య గొడవలు పెట్టి, సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చాలన్నదే వాళ్ల అజెండా. తప్పును భరించడమే చాలా పెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీగా మనం మన తుదిశ్వాస వరకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు పోరాటం చేద్దాం."

- సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

నా పేరు సావర్కర్​ కాదు.. రాహుల్​ గాంధీ

నరేంద్రమోదీ దేశ ఆర్థిక వ్యవస్థను స్వయంగా తన చేతులతోనే నాశనం చేశారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పబోయేది లేదని.. మోదీ-షానే దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్.

" పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రోజున.. భాజపా సభ్యులు ఓ డిమాండ్ చేశారు. మీరు (రాహుల్‌)ఓ మాట అన్నారు, ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. నాతో అన్నారు.. నిజం చెప్పిన నీవు క్షమాపణలు చెప్పాల్సిందేనని. సోదరసోదరీమణులారా... నా పేరు రాహుల్ సావర్కర్‌ కాదు. నా పేరు రాహుల్‌ గాంధీ. నేను సత్యం మాట్లాడినందుకు ఎప్పటికీ క్షమాపణలు చెప్పను. చావనైనా చస్తాను కానీ.... క్షమాపణలు మాత్రం అడగను. ఏ కాంగ్రెస్ సభ్యుడు కూడా క్షమాపణలు చెప్పరు. క్షమాపణలు చెప్పాల్సింది నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఆయన సేవకుడు అమిత్‌షా అతడు దేశానికి క్షమాపణలు చెప్పాలి."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత

ప్రభుత్వ అరాచకాలపై గళం విప్పాలి..

మోదీ సర్కారు రాజ్యాంగంపై కూడా దాడిచేస్తోందని ఆరోపించారు ప్రియాంకగాంధీ. దేశ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వ అరాచకాలపై గళం విప్పాలని పిలుపునిచ్చారు.

" భాజపా ఆరేళ్ల పాలనలో దేశంలో పరిస్థితి దారుణంగా మారింది. నిరుద్యోగులు పెరిగిపోయారు. వృద్ధి రేటు తగ్గిపోతోంది. కర్మాగారాలు మూతపడ్డాయి. కార్లు, టీవీలు, ద్విచక్రవాహనాలు, ఫ్రిజ్​లు, వస్త్రాలు వంటి అన్ని రంగాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు కూడా అన్ని బస్​ స్టాపుల్లో, బహిరంగ ప్రదేశాల్లో, టీవీ ఛానళ్లలో భాజపా ఏమి రాస్తోందో తెలుసా.. మోదీ ఉంటే అన్ని సాధ్యం అని. అసలు విషయం ఇక్కడే ఉంది. భాజపా ఉండటం వల్ల రూ.100కు కిలో ఉల్లిపాయలు సాధ్యమైంది. భాజపా ఉండటం వల్ల నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. భాజపా ఉండటం వల్ల 4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. భాజపా హయాంలో 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భాజపాతో భారతీయ రైల్వే, విమానాశ్రయాలు, రైల్వే విభాగాలు నష్టపోయాయి. భాజపా రూపొందిస్తున్న చట్టాలతో భారతీయ విధానం నాశనం అవుతోంది."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

భారత్ బచావ్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు.. మోదీ సర్కారు ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చూడండి: గంగమ్మ ఒడిలో..'ప్రధాని మోదీ' పడవ విహారం

Last Updated : Dec 14, 2019, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details