తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజకుటుంబీకుల మధ్య రసవత్తర పోరు

కిశోర్​ చంద్ర దేవ్​ వర్సెస్​ శ్రుతి దేవి. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో తండ్రీకూతుళ్లు పోటీపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒడిశాలోనూ అలాంటి కుటుంబం ఒకటి ఉంది. అక్కడ ఇద్దరు కాదు... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పోటీపడుతున్నారు.

ఒడిశా రాజకుటుంబంలో ఆసక్తికర పోరు

By

Published : Mar 29, 2019, 10:13 AM IST

ఒడిశా రాజకుటుంబంలో ఆసక్తికర పోరు
ఒక రాజకుటుంబం. మధ్యలో ఆస్తి వివాదం. వైరం పెద్దదైంది. రాజప్రాసాదమే కాదు... కుటుంబమూ రెండు ముక్కలైంది. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మార్చింది. ఈ కథంతా... ఒడిశా మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజేంద్ర నారాయణ్​ సింగ్​ దేవ్​ కుటుంబానిది.

రాజేంద్ర నారాయణ్​ సింగ్​ దేవ్​ కుమారుడు... అనంగ్​ ఉదయ్​ సింగ్​ దేవ్. ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, అధికార బిజూ జనతా దళ్​ ఉపాధ్యక్షుడు. బలాంగిర్​ శాసనసభ స్థానానికి 1990 నుంచి జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2014లో మాత్రం కాంగ్రెస్​ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

ఇదీ చూడండి:అన్నీ మాట్లాడతా... ఆ ఒక్కటి మినహా!'

ప్రస్తుతం ఒడిశాలో లోక్​సభతో పాటే శాసనసభకూ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంగ్​ ఉదయ్​ సింగ్​ దేవ్​ కుమారులు ఇద్దరూ పోటీచేస్తున్నారు. ఒకరు లోక్​సభకు, మరొకరు శాసనసభకు. పెద్దాయనకు ప్రత్యర్థి వారి బంధువే కావడం విశేషం.

బలాంగిర్​ లోక్​సభ స్థానం...

అనంగ్​ ఉదయ్​ సింగ్​ దేవ్​ కుమారుడు కలికేశ్​ నారాయణ్​ సింగ్​ దేవ్​ బలాంగిర్​ సిట్టింగ్​ ఎంపీ. 2009, 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు మరోమారు అదే స్థానం నుంచి బీజేడీ టికెట్​పై పోటీకి దిగారు.

కలికేశ్​కు ప్రత్యర్థి ఆయన వదిన సంగీతా సింగ్​ దేవ్. 1998, 99, 2004లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బలాంగిర్​ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా గెలిచారామె. 2009, 2014లో కలికేశ్​ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మరోమారు కమలం గుర్తుపై కలికేశ్​పై పోటీకి దిగారు సంగీత.

ఐదేళ్లలో బీజేడీ ప్రభుత్వం చేసిన మంచి పనులే తనను గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు కలికేశ్​.

శాసనసభ బరిలోనూ వారే....

అన్న కలికేశ్​ బలాంగిర్​ లోక్​సభ స్థానానికి పోటీ చేస్తుంటే.... తమ్ముడు అర్కేశ్​ నారాయణ్​ సింగ్​ దేవ్​ బలాంగిర్​ శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అర్కేశ్​ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

ఆ పక్కనే ఉన్న పట్నాగఢ్​ స్థానం నుంచి సంగీత భర్త కనక్​ వర్ధన్​ సింగ్​ దేవ్ బరిలో దిగారు. కనక్​ వర్ధన్ ప్రస్తుతం భాజపా శాసనసభాపక్ష నేత. రాష్ట్ర మాజీ మంత్రి. ఆయన పట్నాగఢ్ సిట్టింగ్​ ఎమ్మెల్యే.

రాజకుటుంబీకుల పోరులో ఎవరు అంతిమ విజేతలో మే 23న తేలనుంది.

ఇవీ చూడండి:

"నోట్ల రద్దుకు 'న్యాయ'మైన​ సమాధానం"

భారత్​ భేరి: రాజకీయం రంగులమయం

ABOUT THE AUTHOR

...view details