మే-జూన్ నెలల్లో సరిహద్దు ప్రాంతమైన గల్వాన్ లోయలో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొన్న ఇండో టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) దళాలకు చెందిన 21 మంది సైనికులకు పరాక్రమ అవార్డు ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఐటీబీపీ. ప్రాణాలు పోతున్నప్పటికీ వారంతా శత్రు సైనికులకు సమర్థంగా సమాధానం ఇచ్చారని కొనియాడింది.
"ఇరు దేశాల సైనికల మధ్య జరిగిన ఘర్షణల్లో తమను తాము రక్షించుకోవటమే కాకుండా, శత్రు సైనికులతో వీరోచితంగా పోరాడారు. అంతేకాకుండా గాయపడిన సైనికులను సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చారు. ఐటీబీపీ దళాలు రాత్రంతా పోరాడినప్పటికి శత్రు సైనికులు రాళ్లతో దాడిచేయటం వల్ల కొంత మంది వీరమరణం పొందారు. వారిని దీటుగా ప్రతిఘటించటం వల్ల అనేక సమస్యాత్మక ప్రాంతాలు భద్రంగా ఉన్నాయి." అని ప్రకటనలో పేర్కొంది ఐటీబీపీ.