డీఎంకే నేత గోడౌన్లో భారీ నగదు పట్టివేత! తమిళనాడులోని వెల్లూరులో డీఎంకే కోశాధికారి దొరై మురుగన్‌కు చెందిన గోడౌన్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఓటర్లకు పంచేందుకని దాచినట్లు అనుమానిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని లెక్కింపులో తేలింది. నోట్ల కట్టలపై ఏ వార్డుకు ఎంత సొమ్ము పంచిపెట్టాలో స్పష్టంగా రాసిపెట్టారు మురుగన్. అనంతరం ఆయన నివాసం సహా మరో ఆరు చోట్ల సోదాలు చేపట్టారు. వెల్లూరు లోక్‌సభ స్థానానికి మురుగన్ కుమారుడు పోటీచేస్తున్నారు. డీఎంకే కోశాధికారి మురుగన్ నివాసంపై ఐటీ శాఖ దాడులు చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి.
శుక్రవారం రాత్రి కట్పాడిలోని డీఎంకే నేత నివాసం సహా కింగ్స్టన్ ఇంజనీరింగ్ కళాశాల, దురై మురుగన్ డిగ్రీ కళాశాలపైనా ఐటీ శాఖ దాడి చేసింది.
దక్షిణాదిలో ఐటీశాఖ దాడులు పెరిగాయి. మార్చి 28న కర్ణాటక మంత్రి పుట్టరాజు నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ ఘటనతో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి పలువురు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక్క సీటు కోసం కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం దక్కట్లేదు.
ఇదీ చదవండి:మత్తుకు బానిసై చిన్నారుల బాల్యం ఛిద్రం