అనుమానం నిజం- మంత్రి ఇంటిపై ఐటీ దాడి కర్ణాటకలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి పుట్టరాజు నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. మండ్యలోని ఆయన నివాసం సహా మైసూరులోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసింది. వీరికి భద్రత కోసం కర్ణాటక పోలీసులకు బదులు సీఆర్పీఎఫ్ సిబ్బంది రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్, జేడీఎస్ నాయకులపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసే అవకాశముందని కర్ణాటక ముఖ్యమంత్రి అనుమానం వ్యక్తం చేసిన కొద్ది గంటలకే పుట్టరాజు నివాసంపై దాడులు జరిగాయి.
ఎన్నికల భయంతోనే భాజపా ఇలాంటి చర్యలు చేపడుతోందని, వీటికి తాను భయపడనని పుట్టరాజు స్పష్టం చేశారు. ఐటీ దాడులకు నిరసనగా త్వరలోనే ఆందోళనలు చేపడతామన్నారు.
కుమారస్వామి తనయుడు నిఖిల్ తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మండ్య లోక్సభ స్థానం నుంచి బరిలో దిగారు నిఖిల్. మండ్య నియోజకవర్గంలో పార్టీ ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు పుట్టరాజు.
ఇదీ చూడండీ:ఐటీ దాడులు జరిగే అవకాశం : కుమారస్వామి