మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత, హవాలా ఆరోపణలతో దిల్లీ, మధ్యప్రదేశ్ (భోపాల్, ఇండోర్)లో కమల్నాథ్ సంబంధీకుల ఇళ్లలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు.
మొత్తం 52 ప్రదేశాల్లో 200 మంది సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో సుమారు 10 నుంచి 14 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి వివరాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, దిల్లీ ఎన్నికల సంఘానికి తెలియజేసినట్టు సమాచారం.
మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ మాజీ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ, ఆయన బంధువు రతుల్ పూరి సహా మరి కొంతమంది నివాసాలపైనా ఐటీ శాఖ దాడులు చేసింది. సరైన లెక్కలు లేని రూ.281 కోట్లకు సంబంధించిన లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు అధికారులు.
భయంతోనే దాడులు: కమల్ నాథ్
దిల్లీ, భోపాల్, ఇండోర్లో జరిగిన ఐటీ సోదాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే భాజపా దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ మీడియా విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
"దేశవ్యాప్తంగా విపక్షాలే లక్ష్యంగా భాజపా ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ధర్నాలకు దిగారు. ఓటమి భయంతోనే భాజపా.. రాజ్యాంగ సంస్థలతో దాడులు చేయిస్తోంది."
-కమల్నాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి