కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెజార్టీ నేతలు సోనియాగాంధీ నాయకత్వంపై విశ్వాసం కనబరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు ఏడు గంటలు వాడీవేడీగా సాగిన ఈ భేటీలో తిరిగి సోనియాకే పగ్గాలు అప్పగించారు. మొత్తం 48 మంది నాయకులు పాల్గొన్న సీడబ్ల్యూసీ సమావేశంలో.. తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఇవ్వాలని సోనియాగాంధీ కోరారు. పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎంపికచేసే ప్రక్రియ.. ప్రారంభించాలని సూచించారు.
గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే.. మాజీ ప్రధాని మన్మోహన్, ఏకే ఆంటోనీ వంటి నాయకులు.. అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరగా అందుకు ఆమె తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ పదవిలో కొనసాగాలని సోనియా గాంధీని మన్మోహన్, ఆంటోనీ సహా ఇతర సీనియర్లు కోరారు. అందుకు సోనియా అంగీకరించారు.
సీనియర్ల లేఖపై రగడ..
ఇదే సమయంలో క్రియాశీలంగా, పూర్తిస్థాయిలో ఉండే నాయకత్వం కావాలంటూ 23 మంది సీనియర్ నేతలు రాసిన లేఖను మన్మోహన్, ఆంటోనీ, అంబికా సోనీ వంటి నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా లేఖపై సంతకం చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లక్ష్యంగా సభ్యులు విమర్శలు గుప్పించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లేఖ రాసిన సమయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో లేఖ రాసిన వారు భాజపాతో కుమ్మక్కయ్యారని రాహుల్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం కావటం కాంగ్రెస్‌లో తీవ్ర దుమారానికి దారితీసింది.
సోనియా ఏకగ్రీవం..
ఈ పరిణామాల నడుమ కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని పి.చిదంబరం సూచించారు. చాలా మంది సభ్యులు సోనియాగాంధీనే కొనసాగాలని కోరగా, మరికొందరు రాహుల్‌ను పగ్గాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ముప్పేట విమర్శలతో లేఖపై సంతకం చేసిన నాయకులు మౌనం దాల్చగా, సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని తీర్మానం చేసింది.
ఏఐసీసీ భేటీ వరకు సోనియానే సారథి..