సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పుడు భారత్ ఉందని.. 1962నాటి పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. భారత్-చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. హిమాచల్‌ప్రదేశ్ భాజపా వర్చువల్ ర్యాలీలో ఈ విషయంపై మాట్లాడారు.
స్వావలంబన భారత్ సాధనకు కృషి చేస్తూనే దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు రవి శంకర్. మోదీ ప్రభుత్వం మొదటి సారి అధికారంలో ఉన్నప్పుడు పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్, మెరుపు దాడులు నిర్వహించామని గుర్తు చేశారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే, ప్రధాని మోదీ నిశ్శబ్దంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మండిపడ్డారు. అంతర్జాతీయ అంశాల మీద సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నలు వేయొద్దని సూచించారు. గతంలో బాలాకోట్ వైమానిక దాడులు, 2016 ఉరి దాడులకు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని దుయ్యబట్టారు.