తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మకు ప్రసవ గండం.. ప్రసూతి మరణాలు ఆందోళనకరం

పేదరికం, నిరక్షరాస్యత, బాల్యవివాహాల వంటి జాడ్యాలు దేశంలో మాతా శిశు సంక్షేమానికి సవాలు విసురుతూనే ఉన్నాయి. ఇవే ప్రధాన కారణాలుగా ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న తల్లుల సంఖ్య అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆందోళనకర స్థితిలో ఉందని చెప్పక తప్పదు.

అమ్మ ప్రసవ గండం-ప్రసూతి మరణాలు ఆందోళనకరం

By

Published : Nov 5, 2019, 8:00 AM IST

Updated : Nov 5, 2019, 5:54 PM IST

ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్దేశించిన ప్రకారం ప్రసూతి మరణాలంటే మహిళ గర్భధారణ, ప్రసవ సమయాల్లో లేదా ప్రసవం తరవాత 42 రోజుల్లోపు గర్భానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2017లో 2.95 లక్షల ప్రసూతి మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లో ఏటా 44 వేలమంది మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవ సమయాల్లో, బాలింతలుగా ఉన్నప్పుడు చనిపోతున్నట్లు అంచనా. ఇందులో 94 శాతం మరణాలు నిరుపేదవర్గాల్లోనే సంభవిస్తున్నాయి.

ఇవి నివారించదగినవే అయినా ఆరోగ్యంపై అవగాహన కొరవడటం, వైద్యం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందని, తక్కువ ఆదాయ వనరులు ఉన్న దేశాల్లో ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. 2017లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మరణాల నిష్పత్తి (మ్యాటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌- ఎమ్‌ఎమ్‌ఆర్‌) లక్ష ప్రసవాలకు సగటున 462. అదే సంవత్సరంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ సంఖ్య 11 మాత్రమే. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ప్రతి 45 మరణాల్లో ఒకటి ప్రసూతి సమయంలో సంభవించిందే. అధికాదాయ దేశాల్లో ప్రతి 5,400 మరణాల్లో ఒకటి మాత్రమే ప్రసూతి మరణం.

కారణాలేమిటి?

దారిద్య్రం, వైద్య సేవల్లో లోపం, ఆరోగ్యంపై సరైన అవగాహన కొరవడటం, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం, సంస్కృతీపరమైన ఆచారాలు, నమ్మకాలు అత్యధికంగా ప్రసూతి మరణాలకు దారితీస్తున్నాయి. 75 శాతం మరణాలు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, ప్రసవానంతర ఇన్‌ఫెక్షన్లవల్ల సంభవిస్తున్నాయి. కాన్పు సమయంలో రక్తపోటు పెరగడం, సురక్షితం కాని పద్ధతుల్లో గర్భస్రావం చేయించుకోవడం వంటివీ కారణాలే. మలేరియా వంటి జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధులు, గుండెపోటు, మధుమేహం తదితరాలూ తల్లుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గర్భం ధరించడానికి ముందే మహిళకు గుండెసంబంధిత వ్యాధులుంటే గర్భవతిగా ఉన్నప్పుడు వైద్యసలహాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రసూతి మరణాల్లో ప్రతి మూడింటిలో ఒకటి గుండెపోటువల్లే సంభవిస్తున్నట్లు అంచనా.

కొన్ని ఆఫ్రికా దేశాలు, దక్షిణ ఆసియా దేశాల్లో వైద్యసేవల్లో లోపాలు, అత్యధిక ప్రసూతి మరణాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రపంచదేశాలు ఏకమై ఎమ్‌ఎమ్‌ఆర్‌ను 2030 కల్లా 70కి తగ్గించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రతువులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లుల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రపంచదేశాలతో కలిసి కొన్ని కార్యక్రమాలను చేపట్టనుంది. మాతాశిశు మరణాలకు కారణమవుతున్న వైద్యసేవల లోపంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మిగతా కారణాలనూ పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మరింత సమగ్రమైన సమాచారాన్ని సేకరించి, పరిష్కారమార్గాలకు పూనుకొంటుంది. పలు దేశాలకు జవాబుదారీతనాన్ని నిర్దేశిస్తుంది.

ఇటీవలి కాలంలో భారత్‌లో ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం శుభపరిణామం. గత 30 ఏళ్లలో ఈ మరణాలు 77 శాతం వరకు తగ్గడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత్‌ను ప్రశంసించింది. 1990లో దేశవ్యాప్తంగా ఎమ్‌ఎమ్‌ఆర్‌ లక్ష ప్రసవాలకు సగటున 556. 2017 నాటికి ఆ సంఖ్య 130కి తగ్గింది. దీనికి ఎన్నో కారణాలున్నా- ప్రధానమైంది కేంద్ర ప్రభుత్వం మాతాశిశు వైద్య సేవలపై దృష్టి సారించి, వాటిని గణనీయంగా మెరుగుపరచడం. ఆస్పత్రిలో ప్రసవాలు 2005లో 18 శాతం. 2016 నాటికి 52 శాతానికి పెరిగేలా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేశాయి. మరోవైపు కేంద్ర పథకం ‘జననీ శిశు సురక్ష కార్యక్రమం’ సత్ఫలితాలనిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వాస్పత్రిలో చేరే గర్భిణి స్త్రీకి ఉచితంగా ప్రసవం చేస్తారు.

రవాణా సదుపాయాలూ ప్రభుత్వమే కల్పిస్తుంది. సాధ్యమైనంతవరకు శస్త్రచికిత్స (సిజేరియన్‌)చేయకుండా సాధారణ ప్రసవానికే అధిక ప్రాధాన్యమిస్తారు. ప్రధానమంత్రి సురక్షిత్‌ మాతృత్వ అభియాన్‌ పథకానికీ ఆదరణ లభించింది. ఈ పథకం కింద గర్భిణిస్త్రీకి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని సేవలూ అందిస్తారు. ఆకర్షణీయమైన ఈ విధానాలవల్ల ప్రస్తుతం గ్రామాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 89 శాతం గర్భిణి స్త్రీలు ప్రసవాలకు ఆస్పత్రులకే వెళ్తున్నారని అంచనా. ప్రసూతి మరణాల నిష్పత్తి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. నీతిఆయోగ్‌ గణాంకాల ప్రకారం 2011-13 సంవత్సరాల్లో లక్ష ప్రసవాలకు దక్షిణాది రాష్ట్రాల్లో 93, ఉత్తరాదిలో 115గా ఉన్న ఈ మరణాల నిష్పత్తి 2014-16 నాటికి వరసగా 77, 93కు తగ్గింది. రాష్ట్రాలవారీగా చూస్తే 2016 నాటికి ఈ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణలో 81, అసోమ్‌లో 237, ఉత్తర్‌ప్రదేశ్‌లో 201, రాజస్థాన్‌లో 199, బిహార్‌లో 165గా ఉంది.

లక్ష్యాలకు సుదూరం

ఒకవైపు సురక్షిత విధానాల దిశగా ప్రస్థానం సాగిస్తున్నా, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యసాధనకు భారత్‌ సుదూరంగానే ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 1990తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు సగానికి తగ్గాయి. ఈ పరిస్థితుల్లోనూ భారతదేశంలో పరిస్థితి ఊహించినంత వేగంగా పురోగమనంలో లేదనే చెప్పాలి. 2015లో ఇండియా, నైజీరియాల్లో సంభవించిన ప్రసూతి మరణాల సంఖ్య ప్రపంచంలోనే మూడోవంతు కావడం విచారకరం. 2017లో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 810 మంది ప్రసూతి సమయంలో చనిపోగా, ఇందులో 15 శాతం నుంచి 20 శాతం భారత్‌లో సంభవించినవే.

మహిళలు విద్యావంతులైతే ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. భారత్‌లో మహిళా అక్షరాస్యత శాతం పెరిగింది. ప్రస్తుతం 68 శాతానికి చేరినట్లు అంచనా. 18 ఏళ్లకు ముందే వివాహం చేసుకుంటున్న వారి శాతం గణనీయంగా తగ్గినా, ఇప్పటికీ దేశవ్యాప్తంగా మహిళల్లో 27 శాతం పెళ్ళిళ్లు నిర్దేశిత వయసుకు ముందే జరుగుతున్నాయి. స్త్రీలకు 18 ఏళ్లు నిండిన తరవాతే పెళ్ళి చేసే విధానాలను ప్రోత్సహించాల్సి ఉంది. 20 నుంచి 30 ఏళ్ల వయసు వరకు మాత్రమే గర్భధారణకు అనువైన సమయమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గర్భం ధరిస్తున్న కిశోర బాలికల్లో, గ్రామీణ నిరుపేద మహిళల్లో ప్రసూతి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.

ప్రసవానికి ముందు, తరవాతా నైపుణ్యమున్న వైద్యసిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటే మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గుతాయి. గర్భం ధరించాక నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ అవసరం. శిక్షణ పొందిన సిబ్బంది మాత్రమే ప్రసవాలు నిర్వహించడం తప్పనిసరి. రెండు ప్రసవాల మధ్య వైద్యులు సూచించిన మేర వ్యవధి అవసరం. గర్భిణి స్త్రీలు ఏ ఔషధం వాడాలన్నా వైద్యుల సూచనలు పాటించాల్సిందే. ఇళ్ళలో ప్రసవాలు ప్రమాదకరమనే అవగాహనను ప్రజల్లో ప్రభుత్వాలు కల్పించాలి.

-నీలి వేణుగోపాల్​ రావు

ఇదీ చూడండి : వాణిజ్య స్వేచ్ఛా విహంగం

Last Updated : Nov 5, 2019, 5:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details