ఎలాంటి ఆటంకాలు లేకుండా 'చంద్రయాన్-3' విజయవంతంగా ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-2లో సాఫ్ట్ ల్యాండింగ్ వైఫల్యంపై దృష్టి పెట్టింది. చంద్రునిపై ఉన్న బిలాలను కృత్రిమంగా సృష్టించి ల్యాండింగ్ ప్రక్రియను పరిశీలించాలని భావిస్తోంది.
ఈ మేరకు బెంగళూరుకు 215 కిలోమీటర్ల దూరం ఉన్న చల్లాకేరెలో ఉల్లార్తిలో కృత్రిమ చంద్ర బిలాలను సృష్టించనుంది. దీనికి సుమారు రూ.24.2 లక్షలు ఖర్చవుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
టెండర్లకు ఆహ్వానం..
ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లకు ఇస్రో ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తవ్వకాల పనులను ఏదైనా ఒక సంస్థకు అప్పగించే ప్రక్రియ ఆగస్టు చివరినాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తవుతుందని తెలుస్తోంది.
ఈ బిలాలు 10 మీటర్ల వ్యాసం, 3 మీటర్ల లోతు ఉంటాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న మాదిరిగా వీటిని నిర్మిస్తారని.. ఇక్కడ ల్యాండింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని చెప్పారు.
సెన్సార్ల పనితీరుపై పరీక్ష..
ఈ పరీక్షల్లో సెన్సార్లు అమర్చిన ఇస్రో విమానాన్ని ఉపయోగించనున్నారు. ఆ ప్రదేశంలో 7 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్ధిష్ట ప్రదేశంలో ల్యాండింగ్‌ను పరీక్షిస్తారు. సుమారు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు విమానానికి సెన్సార్లు ఎలా మార్గనిర్దేశం చేస్తాయో పరిశీలించనున్నారు.