చంద్రయాన్-2 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్‌తో చివరి నిమిషంలో సంబంధాలు కోల్పోయినప్పటికీ.. దేశ ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని తెలిపింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది.
" మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆకాంక్షలు, కలలే ఊపిరిగా ముందుకు సాగుతాం. ఎల్లప్పుడూ ఆకాశమే లక్ష్యంగా సాగాలని మమ్మల్ని ఉత్తేజితుల్ని చేసినందుకు ధన్యవాదాలు."
- ఇస్రో
ఈ 7న జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు మోపేందుకు ఎంతో ప్రతిష్టాత్మంగా చంద్రయాన్-2ను ప్రయోగించింది ఇస్రో. అయితే చంద్రుడికి కేవలం 400 మీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోల్పోయారు శాస్త్రవేత్తలు. అయినప్పటికీ ప్రధాని మోదీ నుంచి సామాన్య పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ ఇస్రో ప్రయత్నానికి అండగా నిలిచారు.