ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. శనివారం ఉదయం 1.30 నుంచి 2.30 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని ముద్దాడనుంది.
ఈ అపూర్వ ఘటనకు ముందు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... చంద్రయాన్-2 గాథలతో ముందుకొచ్చింది. ఆర్బిటర్, ల్యాండర్ 'విక్రమ్', రోవర్ 'ప్రజ్ఞాన్' మధ్య ఓ చమత్కార సంభాషణ జరిగినట్లుగా ఓ సన్నివేశాన్ని సృష్టించి ట్విట్టర్ వేదికగా మనందరితో పంచుకుంది.
సెప్టెంబర్ 2న చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వీడిపోయింది. దీన్ని సరదా సంబాషణగా మలుస్తూ ఓ కామిక్ స్ట్రిప్‌ను ఇస్రో రూపొందించింది.
సంభాషణ సాగిందిలా..
ఆర్బిటర్: ఇప్పటి వరకు నీతో చేసిన ప్రయాణం చాలా బాగుంది విక్రమ్.
విక్రమ్: నిజమే మనది సుదీర్ఘ ప్రయాణం. నేను నిన్ను చంద్రుని కక్ష్యలో చూస్తూనే ఉంటాను.
ఆర్బిటర్: గుడ్ లక్ విక్రమ్! ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేని చంద్రుని దక్షిణ ధ్రువంలోకి వెళ్తున్నావుగా.