భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం-ఇస్రో చరిత్రలో మరపురాని ఏడాదిగా 2019 మిగిలిపోనుంది. ఈ ఏడాదిలో ఇస్రో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించగా.. అందులో దాదాపు ప్రతిదీ విజయవంతమైంది. చంద్రయాన్-2 కూడా 98శాతం అనుకున్న లక్ష్యాలను ఛేదించింది. ఈ తరుణంలో జనవరిలో నింగిలోకి దూసుకెళ్లిన 'మైక్రోశాట్-ఆర్' నుంచి మొన్నటి 'రీశాట్-2బీఆర్1' వరకు ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి ప్రయోజనాలు, ఫలితాలపై ఓ లుక్కేద్దాం..
1. మైక్రోశాట్-ఆర్
ప్రయోజనం : ఇమేజ్ సెన్సింగ్ ఉపగ్రహమైన మైక్రోశాట్-ఆర్.. దేశ రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీవోకు సహకరిస్తుంది. దీనితో పాటు తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన కమ్యూనికేషన్ శాటిలైట్(కలాంశాట్)ను కూడా ప్రయోగించారు.
శాటిలైట్ వాహకం : పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ44
ఎప్పుడు :2019 జనవరి 24, రాత్రి 11.37 గంటలకు
ఎక్కడ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్
2. జీశాట్-31
ప్రయోజనం :మొబైల్ నెట్వర్క్, ఏటీఎం, వీశాట్ నెట్‌వర్క్స్, టెలివిజన్ అప్‌లింక్స్, డిజిటల్ శాటిలైట్, డీటీహెచ్ టెలివిజన్, సెల్యులార్ బ్యాకప్ తదితర కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగుపరుస్తుంది. 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలందించగలదు.
శాటిలైట్ వాహకం : ఏరియానా స్పేస్ రాకెట్
ఎప్పుడు :2019 ఫిబ్రవరి 6, తెల్లవారుజామున 2.31 గంటలకు
ఎక్కడ : ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్
3. ఇమీశాట్
ప్రయోజనం : శత్రుదేశాల రాడార్లను సులువుగా పసిగట్టగలదు. అలాగే మన కదలికలను గుర్తుపట్టకుండా శత్రు శిబిరాల్లో కమ్యూనికేషన్ సౌకర్యాలు నెలకొల్పేందుకు ఉపకరిస్తుంది. ఇమీశాట్ సాయంతో చొరబాటుదారులను సులువుగా గుర్తించొచ్చు.
శాటిలైట్ వాహకం : పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ45
ఎప్పుడు :2019 ఏప్రిల్ 1
ఎక్కడ : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్