గుజరాత్ బూటకపు ఎన్కౌంటర్ల కేసులో ఇద్దరు మాజీ పోలీస్ అధికారులకు ఊరట లభించింది. ఇష్రత్ జహాన్ కేసులో సీబీఐ విచారణ నుంచి మాజీ అధికారులు డీజీ వంజారా, ఎన్కే అమిన్లను విముక్తి కల్పించింది అహ్మదాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు.
విచారణ నుంచి విముక్తి కల్పించాలని వంజారా, అమిన్ కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. మొదట తిరస్కరించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు గుజరాత్ ప్రభుత్వం కూడా అనుమతులిచ్చేందుకు నిరాకరించటం వల్ల పిటిషన్ స్వీకరించింది. ప్రభుత్వ అనుమతులు లేని కారణంగా కేసు నుంచి అధికారులకు విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చారు సీబీఐ కోర్టు న్యాయమూర్తి జేకే పాండ్య.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 197 ప్రకారం విధుల్లో భాగంగా ఉద్యోగులు చేసిన పనులపై విచారణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
భిన్న వాదనలు
ఇష్రత్ తల్లి షమీమా కౌజర్ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ కేసు కేంద్ర హోంశాఖకు సంబంధించిందనీ, ఇందులో గుజరాత్ జోక్యం అవసరంలేదని ఆమె తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ వాదించారు.