తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ కరోనా: వెంటిలేటర్ల కొరత తీరే దారేది?

కరోనా.. శ్వాసవ్యవస్థను దెబ్బతీసే వైరస్. వ్యాధి ముదిరితే వెంటిలేటర్లు చాలా అవసరం. ప్రపంచదేశాల్లో వీటి కొరతతోనే చాలా మంది మరణించే అవకాశాలు ఉన్నాయని నిపుణలు అంచనా. మరి 130 కోట్ల మంది ఉన్న భారత్ లో పరిస్థితి ఎంటి? ఈ పరిస్థితుల్లో దిగుమతులు సాధ్యమేనా? దేశీయంగా ఉత్పత్తయ్యే వాటి సంగతేంటి? ఎప్పటివరకు అందుబాటులోకి వస్తాయి?

By

Published : Apr 2, 2020, 2:40 PM IST

ventilators
వెంటిలేటర్లు

కరోనా దెబ్బకు దేశాలకు దేశాలే గిరిగీసుకొని, స్వీయ నిర్బంధంలో ఉంటున్నా మృత్యుఘోష ఆగట్లేదు. దాని ప్రభావం ప్రధానంగా శ్వాస వ్యవస్థ పై పడడం వల్ల ప్రపంచ దేశాలు వెంటిలేటర్లపై దృష్టిసారించాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ వెంటిలేటర్ల కొరతతో చాలామంది చనిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మిగతా దేశాల పరిస్థితి తలచుకుంటేనే భయం వేస్తోంది.

వ్యాధిగ్రస్థులకు, ప్రమాద బాధితులకు, శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు ఊపిరి తీసుకోవటం వీలుకాని వారికి కృత్రిమశ్వాస అందించే పరికరమే వెంటిలేటర్‌. ఈ పరికరమే కరోనా చికిత్సలో అత్యంత ప్రధానమైనది. ఒకరకంగా చెప్పాలంటే సంజీవని.

వెంటిలేటర్ అత్యవసరం..

శ్వాసకోస వ్యవస్థను పరిరక్షించుకోకపోతే ఊపిరి అందక, రక్తంలో సరిపడా ఆక్సిజన్‌ కలవదు. ఫలితంగా ఉపిరితిత్తులతో పాటు అంతర్గత అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. అంతిమంగా మరణం. కరోనా వైరస్‌ బాధితుల మరణాలకు ఇదే మూలకారణం.

అమెరికాలోని అతిపెద్ద నగరం న్యూయార్క్‌లోనే లక్ష వెంటిలేటర్లు ఉన్నా మరణాలు ఆగట్లేదు. అలాంటిది యావత్ భారతావనిలో అందుబాటులో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య 50 వేల లోపేనన్నది నిపుణుల మాట. వీటిలో కరోనా బాధితుల కోసం 14 వేలు కేటాయించారు.

బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా జులై నాటికి ఏ స్థాయికి చేరుతుందో కూడా అర్థం కావటం లేదు. అప్పటికి 10- 12 లక్షల వెంటిలేటర్లు అవసరమని ఒక అంచనా. ప్రస్తుతానికి వాటి తయారీ కోసం విదేశాల నుంచి విడిభాగాలు దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్​ చేస్తున్నారు.

లక్షల్లో ఖరీదు..

ప్రస్తుతం ఒక్కో వెంటిలేటర్‌ ఖరీదు రూ.5-10 లక్షల వరకు ఉంటుంది. కరోనా దెబ్బతో ఆర్థికంగా కుదేలైన సమయంలో అంత ఖర్చు చేసి భారీ సంఖ్యలో వాటిని సమకూర్చుకోవడం సాధ్యమేనా అన్నది కూడా ప్రశ్నార్థకమే.

కరోనా వైరస్‌ బారినపడినా, 80% మంది సాధారణ చికిత్సతో కోలుకుంటారని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది. బాధితుల్లో 10%మందికి సాధారణ ఆక్సిజన్ సిలిండరు సాయంతో చికిత్స చేయెుచ్చు. మరో 10%మందికి వెంటిలేటర్లు అవసరమవుతాయి.

శ్వాసకోశం- గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ, కరోనా వైరస్‌ బారిన పడిన వారికి వీటి అవసరం ఎక్కువ. ఈ గణాంకాల ప్రకారం అమెరికాలో మరణాల సంఖ్య లక్ష వరకు ఉండవచ్చని సుప్రసిద్ధ ఎండమాలజిస్ట్‌ ఆంథోని ఫాసీ అంచనా వేస్తున్నారు. అలాంటి సంకటమే మనకు వస్తే.. ఇప్పుడు ఉన్న వెంటిలేటర్ల సంఖ్య ఏమాత్రం సరిపోదు.

దిగుమతి సాధ్యమేనా?

దిగుమతి చేసుకుందామా అంటే... యావత్ ప్రపంచం కరోనా పిడికిలిలో విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు భారత్‌కు వెంటిలేటర్లు సరఫరా చేయడం దాదాపుగా అసాధ్యమే. ఇప్పటికే పలు దేశాలు వెంటిలేటర్లు ఎగుమతులపై అంక్షలు విధించాయి.

8 రకాల సెన్సార్లు, రెసిస్టర్లు, కెపాసిటర్లు, డయోడ్ల వంటి విడిభాగాలు చైనా, ఐరోపా, అమెరికా, జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అందువల్ల భారీస్థాయిలో ఉత్పత్తి పెంచలేమని, దేశీయంగా వీటిని అసెంబుల్​ చేయలేమని తయారీ సంస్థలు చేతులెత్తేశాయి.

రంగంలోకి డీఆర్డీఓ..

ఈ కష్టకాలంలో దేశీయంగా తక్కువ ఖర్చుతో వీటి డిజైన్‌ బాధ్యత భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) వంటి సంస్థలు స్వీకరించాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు దిగ్గజ సంస్థలు మహీంద్రా, మారుతీ సుజుకీ వంటి వాహన సంస్థలు వెంటిలేటర్ల తయారీకి ముందుకు రావడం సాంత్వన కలిగిస్తున్న అంశం.

ఒకేసారి ఎక్కువమందికి సేవలందించే వెంటిలేటర్‌ను భారత రక్షణ పరిశోధనా సంస్థ డిజైన్‌ చేసింది. మెుదటి నెలలో 5,000, రెండో నెలలో 10,000 వెంటిలేటర్లు తయారు చేయగలమని తెలిపింది. మరింత భారీ సంఖ్యలో తయారు చేసేందుకు ఈ డిజైన్‌ను మహీంద్ర అండ్‌ మహీంద్ర సహా వివిధ కంపెనీలకు అప్పగించింది.

దిగ్గజ కంపెనీల చేయూత..

కరోనా వైరస్‌ చికిత్సకు సరిపడా ఆటోమేటడ్‌ బ్యాగ్‌వాల్వ్‌ మాస్క్ వెంటిలేటర్‌ను రూ.7,500 తయారు చేసేందుకు సిద్ధమవుతున్నామని మహీంద్ర సంస్థల అధిపతి ఆనంద్‌ మహీంద్ర ప్రకటించారు. ఇప్పటికే ఆ సంస్థ తయారీలో నిమగ్నమైంది.

వెంటిలేటర్ల తయారీ లైసెన్స్‌ కలిగిన ఆగ్‌వా హెల్త్‌కేర్‌తో ఒప్పందం చేసుకున్నామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. నెలకు 10 వేల వెంటిలేటర్లు తయారీ తమ లక్ష్యమని వెల్లడించింది. 2 నెలల్లో లక్ష వెంటిలేటర్ల తయారే లక్ష్యంగా పనిచేస్తున్నామని మైసూరు కేంద్రంగా పనిచేసే స్కన్‌రాయ్‌ టెక్నాలజీస్‌ తెలిపింది.

వీరితో పాటు, ప్రభుత్వ సంస్థయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ను 2 నెలల్లోపు 30వేల వెంటిలేటర్లు సరఫరా చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.

పీపీఈల సంగతి..

వీటితో పాటు అత్యంత ముఖ్యమైన పరికరాలు వైద్యసిబ్బంది ధరించే వ్యక్తిగత రక్షణ పరికరాలు. దేశంలో ఇప్పటికి వరకు 3.34 లక్షల పీపీఈలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్యసిబ్బంది సంరక్షణే ధ్యేయంగా ఇప్పటివరకు 11 సంస్థలకు 21 లక్షల పీపీఈల తయారీకి కేంద్రం ఆదేశించింది.

ఆ సంస్థలు రోజుకు 5 నుంచి 7 వేల వరకు సరఫరా చేస్తున్నాయి. ఇవేకాక సింగపూర్‌ కంపెనీ నుంచి 10 లక్షలు, కొరియా కంపెనీ నుంచి 20 లక్షల పీపీఈలు రానున్నాయి. వ్యక్తిగత రక్షణలో అతి ముఖ్యమైన ఎన్‌95 మాస్కులను రానున్న రోజుల్లో 20 లక్షల మేర ప్రభుత్వాలకు అందజేస్తామని డీఆర్‌డీఓ సంస్థ ప్రకటించింది. 10 లక్షల మాస్కులు సింగపూర్‌ నుంచి రానున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో నుంచే కొత్త ఆవిష్కరణలు ఉద్భవిస్తాయి. అలాంటిదే ప్రస్తుతం దేశంలో జరుగుతోంది. లక్షల రూపాయలకుపైగా విలువ చేసే వెంటిలేటర్లు తక్కువ ధరలకే అందించడానికి దిగ్గజ సంస్థలు ముందుకు రావడం చాలా సానుకూలంశం. ఇదే ఉత్సాహంతో అనుకున్న సమయానికి తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులోకి వస్తే ఎన్నో మరణాలను అడ్డుకోవచ్చు.

ఇదీ చూడండి:ఆపరేషన్​ కరోనా: భారత వైద్య వ్యవస్థ సత్తా ఎంత?

ABOUT THE AUTHOR

...view details