రాజ్యసభ ఎన్నికల వేళ ఝలక్ ఇచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి పూర్తి శక్తిని వినియోగిస్తామన్నారు. భాజపాకు ఓటు వేయడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని మాయవతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. భాజపా అభ్యర్థికైనా ఓటు వేయడానికి సిద్ధంగానే ఉంటాం. లేదంటే మరో పార్టీకి వేస్తాం."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ప్రియాంక ట్వీట్...
మాయావతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్లో స్పందించారు. భాజపాకు ఓటేస్తామని మాయావతి చెప్పిన సదరు వీడియోను పోస్ట్ చేస్తూ "ఇంతకన్నా చెప్పడానికి ఏమైనా ఉందా?" అంటూ రాశారు.