నీటి కొరత, నాణ్యత నేడు ప్రజలను వేధిస్తున్న పెద్ద సమస్యలు. గంగ, గోదావరి, కృష్ణా, కావేరి, యమున, నర్మద తదితర జీవనదులు ఉప్పొంగే దేశంలో- జల సంక్షోభం తీవ్రరూపుదాల్చడం గమనార్హం. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూగర్భ, ఉపరితల జల వనరులు కలుషితమైన నేపథ్యంలో తరుణోపాయం తెలియని సందిగ్ధావస్థ నెలకొంది. నల్లా నీటిపై భరోసా లేక శుద్ధజలం పేరిట అమ్మే నీటిని కొనుక్కుని తాగుతున్నా రోగాలు తప్పడం లేదు. ప్రజల అవసరాలు, బలహీనతలే పెట్టుబడిగా పుట్టుకొచ్చిన శుద్ధజల కేంద్రాలు ప్రమాణాలకు పాతరేసి తాగేయోగ్యత లేని నీటినే డబ్బాల్లో నింపి ప్రజారోగ్యంతో వ్యాపారం చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ శుద్ధ జల కేంద్రాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం శుద్ధిచేసే జలాల్లో 60 శాతం నీటిని వెనక్కు ఇచ్చే సామర్థ్యంలేని రివర్స్ ఆస్మోసిస్ (ఆర్‌ఓ) ప్లాంట్లను డిసెంబర్ 31 లోగా నిషేధించకపోతే జనవరి నుంచి సదరు అధికారుల జీతాల్లో కోత పెట్టాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలిచ్చింది. మొత్తం కరిగిన లవణాల సాంద్రత (టీడీఎస్) లీటర్‌కు 500 మిల్లీ గ్రాములకంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్‌ఓ నీటిని నిషేధించాలని ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్టే విధించాలంటూ ఆర్‌ఓ ప్లాంట్ల తయారీదారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కేంద్రంలోని సంబంధిత శాఖను సంప్రతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే, ఆర్‌ఓ నీటిని పూర్తిగా పక్కనపెట్టేయలేని పరిస్థితులూ ఉన్నాయి.
ఆర్‌ఓ నీటిని కలుషిత నీటికి ప్రత్యామ్నాయంగానే మాత్రమే కాకుండా, ఫ్లోరైడ్, లోహాల గాఢత, హానికర మూలకాల ముప్పు ఎక్కువగా ఉన్నచోట వాటి నుంచి బయటపడేందుకు ప్రజలు శుద్ధజలం వాడుతున్నారు. ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పంటలకు వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగు మందులు, రొయ్యల సాగు వ్యర్థాలు, ఆక్వాకు వినియోగిస్తున్న ఉప్పు జలాల కారణంగా చాలా ప్రాంతాల్లో తాగు, సాగు నీరు కలుషితమైంది. ఆర్‌ఓ పరిజ్ఞానంతో శుద్ధి చేస్తేతప్ప ఈ నీటిని తాగడానికి వినియోగించలేని దుస్థితి నెలకొంది.
నల్లాలపై అపనమ్మకం
నీరు స్వచ్ఛంగా కనిపించినంత మాత్రాన నాణ్యత ఉన్నట్లు కాదు. కంటికి కనిపించని క్షారత్వం, ఆమ్లత్వం, భార లోహాల గాఢత్వం పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందువల్ల భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం శుద్ధిచేసిన నీటికి, సాధారణ యంత్రాలతో శుద్ధి చేసిన నీటికి మధ్య తేడా పెద్దగా తెలియదు. రుచి, నాణ్యతను మినహాయిస్తే చూడటానికి రెండూ ఒకేలా కనిపిస్తాయి. సరిగ్గా ఈ అంశమే ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి అందిస్తున్న రక్షిత నీరు, అక్కరకు రాకుండా పోతుంటే ప్రైవేటు శక్తులు సరఫరా చేసే ఆర్‌ఓ నీరే దిక్కవుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా శుద్ధజలం పేరిట నాణ్యత లేని నీరే ముంచెత్తుతోంది. స్థానిక ప్రభుత్వాలు సరఫరా చేసే నల్లా నీటిని కాదని, శుద్ధజలం పేరిట ఇలాంటి డబ్బా నీటివైపు ప్రజలు మళ్లడానికి కారణాలు లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో భారీసంఖ్యలో తాగునీటి జలాశయాలు, రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా నిర్వహణ అధ్వానంగా ఉంటోంది.
సకాలంలో జలాశయాలు, ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, లీకేజీల కారణంగా కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు కలుషితమవుతున్నాయి. స్థానిక సంస్థల సిబ్బంది క్లోరినేషన్ వరకు పరిమితమై, అదే నీటిని పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు 2009లో, అనంతరం 2014 తరవాత ఉభయ రాష్ట్రాల్లో పంపిణీ చేసిన నీటిపరీక్ష కిట్లను ఎక్కడా వాడిన దాఖలాలు లేవు. పలు నగరాలు, పట్టణాల్లో 30-40 ఏళ్ల క్రితం తవ్వి వేసిన గొట్టంమార్గాలు తుప్పుపట్టి, చిల్లులు పడి శిథిలమయ్యాయి. వాటిపక్కనే మురుగునీటి పారుదల వ్యవస్థా ఉండటంతో... రెండూ కలిసిపోయి తాగునీరు కలుషితమవుతోంది. నాణ్యత, నిర్వహణనుబట్టి రెండు మూడు దశాబ్దాలకోసారి భూగర్భ గొట్టంమార్గాల్ని మార్చాల్సి ఉన్నా, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సర్కారు సరఫరా చేసే తాగునీటిపై నమ్మకం కుదరక, వాటిని తాగేందుకు జనం విముఖత చూపుతున్నారు. వ్యయ భారమైనా డబ్బా నీటినే కొని తాగుతున్నారు.
నియంత్రణ కొరవడి
జర్మనీ, రష్యా, అమెరికాల్లో ఆర్‌ఓ నీటిపై నిషేధం లేకున్నా అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మనదేశంలో మాత్రం ఆర్‌ఓ ప్లాంట్లపై కనీస పర్యవేక్షణ కొరవడినందువల్ల నీటి వ్యాపారం వేలకోట్ల రూపాయలకు పడగలెత్తింది. తెలుగు రాష్ట్రాల్లో నీటిశుద్ధి కేంద్రాలపై నియంత్రణ లేకుండా పోయింది. వాటి సంఖ్య ఎంత అనే లెక్కలే లేవు. ఓ అంచనా ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో 18 వేలకిపైగా ఆర్‌ఓ ప్లాంట్లు నడుస్తుండగా, వాటిలో 90 శాతం కేంద్రాలు అనుమతులు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నాయి. హానికర సూక్ష్మజీవులతో కూడిన జలాన్ని ప్రజల గొంతుల్లోకి దింపుతున్నాయి. బీఐఎస్ నియమాలకు అనుగుణంగా ప్లాంటు పెట్టాలంటే- పాతిక నుంచి ముప్ఫై లక్షల రూపాయల ఖర్చవుతుంది. అప్పుడు 20 లీటర్ల డబ్బాకు రూ.30 దాకా ఖరీదు పెట్టాల్సి వస్తుంది.