తెలంగాణ

telangana

ఉరి తీసే ముందు తలారి తప్పకుండా మందు కొట్టాలా?

By

Published : Mar 19, 2020, 7:58 PM IST

ఎవరైనా మన కళ్ల ముందు ప్రాణాలు కోల్పోతేనే అల్లాడిపోతాం. అలాంటిది తలారిగా విధులు నిర్వర్తించేవారికి ఎంత మనో నిబ్బరం కావాలి. ఆ సమయంలో ధైర్యంగా ఉండేందుకు మందు తాగుతారని పలువురు భావిస్తారు. ఇందులో నిజమెంత? నిర్భయ దోషులను ఉరి తీసే పవన్​ జల్లాడ్​ ఏమంటున్నాడో తెలుసా?

Is it necessary to drink alcohol hangman
ఉరి తీసే ముందు తలారి తప్పకుండా మందు కొట్టాలా?

నిర్భయ సామూహిక అత్యాచార దోషులను.. ఉరితీసే అవకాశం ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్​కు చెందిన పవన్​ జల్లాడ్​కు దక్కింది. 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులోని నలుగురు నిందితులను ఉరితీసేందుకు ప్రభుత్వం పవన్​నే ఎందుకు ఎంచుకుంది? అసలు అతను ఎవరు? ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి విషయాలు మీకోసం...

పవనే ఎందుకు..?

నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవన్​ జల్లాడ్​ సరైన వ్యక్తిగా తిహార్​ జైలు అధికారులు భావించారు. పవన్​కు ఉరి తీసిన అనుభవం ఉంది. శారీరకంగా బలిష్ఠంగా ఉన్నాడు. అతని పూర్వీకులు కూడా తలారిలే కావటం వల్ల ఎలాంటి తప్పిదాలు జరగవన్న భావనతో అధికారులు పవన్​వైపు మొగ్గుచూపారు. ఈ మేరకు తిహార్ అధికారులు అర్జీ పెట్టుకోగా ఉత్తర్​ప్రదేశ్​ జైళ్ల శాఖ అంగీకరించింది.

పారితోషికం ఎంత..?

ఉరివేస్తే తలారిలకు ప్రభుత్వం ఎంత పారితోషికం ఇస్తుందనే సందేహం సాధారణంగా ప్రతిఒక్కరిలో ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒకరికి ఉరి వేస్తే రూ.25 వేలు చెల్లిస్తుంది ప్రభుత్వం. అంటే నిర్భయ దోషులకు నలుగురికి మరణశిక్ష అమలు చేస్తే పవన్​కు లక్ష రూపాయలు పారితోషికంగా లభిస్తుంది.

పవన్​కు అంగీకారమేనా?

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం రావాలని పవన్​ జల్లాడ్​ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. తలారిగా ఎంపికైన వెంటనే ఉత్తర్​ప్రదేశ్​ జైళ్ల శాఖకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

జల్లాడ్​ ఇంటిలో కొత్త వెలుగు!

తలారిగా విధులు నిర్వర్తిస్తున్నందుకు నెలకు రూ.5వేలు పవన్​కు చెల్లిస్తుంది ఉత్తర్​ప్రదేశ్ జైళ్ల శాఖ. అతనికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం ఇదే. ప్రస్తుతం ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు జల్లాడ్. శిథిలావస్థకు చేరుకున్న మేరఠ్​లోని తన ఇంటికి మరమ్మతులు చేయించే స్తోమత కూడా లేదని తెలుస్తోంది.

నిర్భయ దోషుల ఉరి ద్వారా లభించే రూ.లక్ష.. తన ఆర్థిక అవసరాలు తీరుస్తాయన్న ఆశతో ఉన్నాడు జల్లాడ్​. తన కూతురు పెళ్లికీ ఈ డబ్బు వినియోగిస్తానని చెబుతున్నాడు.

ఉత్తర భారతంలో ప్రముఖ తలారిలు..

పవన్​ జల్లాడ్​తో కలిపి అతని కుటుంబంలో నాలుగు తరాల వాళ్లు తలారిలుగా పనిచేశారు. పవన్​ ముత్తాత లక్ష్మణ్​ కుమార్​, తాత కాలూరాం, తండ్రి మమ్ము ఇదే వృత్తిలో ఉన్నారు. ఉత్తర భారతంలో పలువురికి ఉరి శిక్ష అమలు చేసే సమయంలో వీరి పేర్లే ప్రముఖంగా వినిపించేవి.

కీలక కేసుల్లో దోషులకు..

జల్లాడ్​ కుటుంబ సభ్యులు అనేక కీలక కేసుల్లో దోషులకు ఉరిశిక్షను అమలు చేశారు. పవన్​ తండ్రి, తాత కలిసి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకులు సత్వార్​ సింగ్​, కెహర్​ సింగ్​కు ఉరిశిక్ష అమలు చేసినప్పుడు తలారిగా ఉన్నారు. 1989లో ఓ సంచలన హత్యాచార కేసులో దోషికి తన తాతతో కలిసి పవన్​ ఉరి అమలు చేశాడు. దోషి కాళ్లను తాను కడితే, తన తాత తాడు లాగి ఉరి తీసినట్లు గుర్తుచేసుకున్నాడు పవన్. అప్పట్లో ఆ వ్యక్తికి మరణశిక్ష వేసినందుకు తమకు రూ.200 మాత్రమే ఇచ్చారని చెప్పాడు.

మద్యం తాగడం నిజమేనా?

సాధారణంగా ఒక వ్యక్తికి మరణశిక్ష అమలుచేసేటప్పుడు మానసికంగా ఎంతో ధైర్యం కావాలి. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఉరితీసే ముందు తలారి మద్యం సేవిస్తాడని ప్రచారంలో ఉంది. అయితే వాటిని కొట్టిపారేశాడు పవన్​.

"నేను ఎప్పుడూ మద్యం తాగను. ఉరి తీసేముందు తలారిలు మందు తాగుతారన్నది అపోహ మాత్రమే. తాడును లాగేటప్పుడు ఎంతో సమన్వయంతో మెలగాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి."

-పవన్​ జల్లాడ్​, తలారి

ABOUT THE AUTHOR

...view details