భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల కథ సమాప్తమైనట్లేనా? తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం చెప్పక తప్పేలా లేదు. ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతూ గల్లంతైన ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
నేటితో పగలు పూర్తి
మరోవైపు చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం నేటితో ముగిసిపోనుంది. అనంతరం రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలవుతుంది. నేటి నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలకు చేరుకుంటాయి. ల్యాండర్, రోవర్ ఈ చలిని తట్టుకోలేవు. విక్రమ్.. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొడుతూ 'హార్డ్ ల్యాండింగ్' జరిగినట్లు చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.
నాసాకూ దొరకలేదు..
ఈ వ్యోమనౌకను చిత్రీకరించేందుకు ఈ నెల 17న నాసాకు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)ప్రయత్నించినప్పటికీ దాని జాడ తెలియలేదు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోవడానికి కారణాలను విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ శోధిస్తుందని, త్వరలోనే ఒక నివేదికను వెలువరిస్తామని ఇస్రో ప్రకటించింది.
మరోసారి ప్రయత్నం!
14 రోజుల అనంతరం తిరిగి పగటి సమయం మొదలయ్యాక చంద్రయాన్-2 ఆర్బిటర్ మరోసారి విక్రమ్ కోసం శోధించనుంది. వచ్చే నెల 14న ఎల్ఆర్ఓ కూడా ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని ఫొటో తీయనుంది. మరోవైపు ఆర్బిటర్‌లోని 8 సైన్స్ పరికరాలపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇస్రో తెలిపింది. వాటి నుంచి డేటా, చిత్రాలు అందనున్నాయని పేర్కొంది.
200 కిలోమీటర్ల వేగంతో ఢీ
విక్రమ్ ల్యాండర్‌లోని ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రోగ్రామ్‌లో తలెత్తిన లోపం వల్లే అది జాబిల్లిపై సాఫీగా దిగలేక పోయిందని నిపుణులు చెబుతున్నారు. గంటకు 200 కిలోమీట్లర్లకుపైగా వేగంతో చంద్రుడిని ఢీ కొట్టి, నిర్వీర్యమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు.