తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర నిర్మాణం.. 2024 ఎన్నికల వ్యూహమేనా?

ప్రతి ఎన్నికల సమయంలో భాజపా రూపొందించే మేనిఫెస్టోలో ప్రధాన అంశం... అయోధ్యలో రామమందిర నిర్మాణం. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భూమి పూజతో ఆ కల నెరవేరబోతోంది. అయితే ఇంతకాలం ఆధ్యాత్మిక అంశంగా భావించిన రామమందిర నిర్మాణం విషయంలో భాజపా రాజకీయంగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందా? 2024 ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించేందుకు కమలదళం ఏం చేయబోతోంది? మోదీ ప్రత్యేక ఆకర్షణగా భూమిపూజ చేయడానికి కారణం ఏమిటి? అయోధ్య ఉద్యమాన్ని భుజానికెత్తుకొని నడిపించిన పార్టీ అగ్రనేత అడ్వాణీ పేరును మోదీ ప్రస్తావించకపోవడం దేనికి సంకేతం?

By

Published : Aug 6, 2020, 5:43 PM IST

ayodhya
రామమందిర నిర్మాణం

అయోధ్యలో జరిగిన రామమందిర భూమి పూజ చారిత్రక ఘట్టం. లౌకిక దేశమైన భారత్​లో మతపరంగా, సామాజికంగా దీని ప్రభావం చాలానే ఉంటుంది. అయితే రాజకీయంగానూ ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా రామాలయ శంకుస్థాపన వేడుక జరగడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అటు భాజపాలో గానీ, ఇటు కేంద్ర ప్రభుత్వంలో గానీ, అయోధ్య ఉద్యమంలో గానీ కీలకంగా పని చేసిన నేతల ప్రస్తావనే లేకుండా మోదీ కేంద్రంగా భూమిపూజ తంతు కొనసాగింది. భాజపా కూడా ఆలయ నిర్మాణం క్రెడిట్​ అంతా ప్రధానికే ఇచ్చేసింది. మోదీని ఏకంగా రామాలయానికి చిహ్నంగా ఆకాశానికి ఎత్తింది.

అయోధ్య ఉద్యమాన్ని భుజానికెత్తుకుని, ఆలయ నిర్మాణమే ఊపిరిగా పోరాడిన భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ, సీనియర్​ నాయకులు మురళీ మనోహర్​ జోషినీ ఆహ్వానించకుండా పక్కన పెట్టింది. అయోధ్యవ్యాప్తంగా కట్టిన ఏ ఒక్క కటౌట్​లోనూ వారి ఫొటో లేకపోవడం గమనార్హం.

అలా ఎందుకు చేసింది?

అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి విషయంలో భాజపా వ్యూహాత్మకంగానే అలా చేసిందా? అనే అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. రామాలయం ఆయుధంగా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రధానాంశంగా ఉండేది. ఆ చిరకాలం స్వప్నం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో నెరవేరబోతోంది. ఈ నేపథ్యంలో మోదీకి ఉన్న ప్రజాదరణకు తోడు ఆలయ నిర్మాణం క్రెడిట్​ను కూడా ఆయనకే ఇచ్చేస్తే భవిష్యత్​లో జరిగే ఎన్నికల్లో భాజపా గెలుపునకు దోహదపడుతుందనే అలోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందుకునేందుకే నరేంద్ర మోదీ కేంద్రంగా భాజపా రాజకీయాలు చేస్తుందని, అందుకే సీనియర్లను శంకుస్థాపనకు ఆహ్వానించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అడ్వాణీ పేరు కూడా ప్రస్తావించని మోదీ

ఎన్నో ఎళ్ల పోరాటం తర్వాత రామాలయ నిర్మాణానికి మోక్షం లభించింది. నాటి ఉద్యమంలో ముందుండి నడిచారు అడ్వాణీ. మురళీ మనోహర్​ జోషి కూడా ప్రముఖ పాత్రే పోషించారు. బాబ్రీ ఘటనలో ఇప్పటికీ వారు విచారణను ఎదుర్కొంటున్నారు. నేటి రామాలయ నిర్మాణ ఫలితం అడ్వాణీ శ్రమే అని ప్రస్తుత భాజపా నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ట్రస్ట్​ నిర్వాహకులకు తెలుసు. అయినా కావాలనే అడ్వాణీని ఆహ్వానించలేదు. దీనికి తోడు అయోధ్య సభలో అడ్వాణీ పేరును కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. రథయాత్రను సారథిలా నడిపించిన అడ్వాణీ శ్రమను ఆలయ శంకుస్థాపన వేళ ప్రధాని మోదీ గుర్తుచేసుకోకపోవడం శోచనీయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎలా వచ్చారు?

అయోధ్యలో రామాలయం భూమిపూజకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో సమానంగా ఆయనకు శంకుస్థాపనలో ప్రాధాన్యం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో అయోధ్య ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న అడ్వాణీ పేరును మోహన్ భగవత్ గుర్తు చేసుకున్నారు.

అడ్వాణీ భూమిపూజకు రాకపోవడానికి కరోనాను కారణంగా చెబుతోంది భాజపా. కానీ స్పష్టమైన ఆహ్వానం లేకపోవడం వల్లే అడ్వాణీ అయోధ్యకు రాలేదనే విషయం బహిరంగ రహస్యం. ఒక వేళ కరోనానే కారణం అయితే 70 ఏళ్లు ఉన్న మోహన్ భగవత్ ఎలా వచ్చారని అడ్వాణీ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం..

అయోధ్యలో రామమందిరాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్​కు మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. 2024 ఎన్నికల సమయానికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భాజపా భావిస్తోంది. పైగా రామాలయ నిర్మాణ ఖ్యాతిని మోదీ-షా ద్వయం ఖాతాలో వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మోదీ కృషి వల్లే అయోధ్యలో భూమిపూజ జరిగిందంటూ పార్టీ వర్గాలు, ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శంకుస్థాపన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్​ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకురుస్తున్నాయి.

" రాముడు మంచి పాలకుడు. గుణవంతుడు. ప్రజలందరికీ కావాల్సినవాడు. మంచితనానికి ప్రతీక. ఇది ఒక చారిత్రక క్షణం. ప్రధాని మోదీ వల్లే భూమిపూజ సాధ్యమైంది."

- రమేశ్​ పోఖ్రియాల్​, కేంద్ర విద్యాశాఖమంత్రి.

ABOUT THE AUTHOR

...view details