హైడ్రోపోనిక్ వ్యవసాయం..!అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతున్న తరుణంలో అందుబాటులోకి వచ్చిన కొత్త తరహా సాగు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ విధానానికి మెరుగులు దిద్దారు అసోం వాసులు. సహజ పద్ధతుల్లో, తక్కువ ఖర్చుతో పంటలు పండించడం అలవర్చుకున్నారు. అయితే.. ఇది గతం.
ఇప్పుడిదే వారి ఆగ్రహానికి కారణమైంది. అసోం వాసులు హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేందుకు వరదల కోసం ఎదురుచూస్తున్నట్లు జులై 13న జాతీయ దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. వరదలతో అతలాకుతలం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వార్తలపై మజూలి వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మజూలి ద్వీపంలో ఉండే ప్రజలు, రైతులు ఈ వార్త పూర్తి వాస్తవం కాదని స్పష్టం చేశారు. సౌత్ ఏషియన్ ఫోరమ్ ఫర్ ఎన్విరాన్మెంట్(సేఫ్) అనే ఓ ఎన్జీఓ సహకారంతో... అతి కొద్ది మంది రైతులు మాత్రమే హైడ్రోపోనిక్ వ్యవసాయానికి మొగ్గు చూపారని పేర్కొన్నారు.
''ఈ ప్రాజెక్టుతో మాకెలాంటి ప్రయోజనం చేకూరట్లేదు. ఈ రుతుపవనాల కాలంలో.. అలాంటి సాగుతో పంటలు పండించడం అసాధ్యం. వరదలు మాకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ తరహా వ్యవసాయం మా సమస్యల్ని గట్టెక్కించలేదు.''
- హైడ్రోపోనిక్ వ్యవసాయం ప్రయత్నించిన రైతు
మజూలిలో వరదలు బీభత్సం సృష్టించాయని.. పంటపొలాలు మునిగిపోయి రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు స్థానికులు. 'రైతులెప్పుడూ వరదల్ని కోరుకోలేదు.. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త' అని జులై 13న ప్రచురితమైన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ఈ హైడ్రోపోనిక్ వ్యవసాయంపై సేఫ్ అనే ఎన్జీఏ సంస్థ చొరవ తీసుకుంది. ఈ ప్రాజెక్టు ఫలితాల్ని.. ఇంత తొందరగా నిర్ధరించలేం. పూర్తిగా అంచనా తర్వాత నిర్ధరించవచ్చు.''