తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటన్​ నౌకలోని భారతీయులపై 'ఈటీవీ భారత్​' ఆరా - ETV BHARAT

ఇరాన్​ అధీనంలోని బ్రిటన్​నౌకలో ఉన్న భారతీయులపై 'ఈటీవీ భారత్'​ ఆరా తీసింది. 18 మంది ఇండియన్స్​ గురించి తమకు సమాచారం లేదన్న ఇరాన్​ అధికారులు.. వారి గురించి తెలిస్తే మీడియాకు తెలుపుతామని స్పష్టం చేశారు. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్​ శుక్రవారం స్వాధీనం చేసుకున్న ఈ నౌకలో భారతీయులు సహా మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు.

బ్రిటన్​ నౌకలోని భారతీయులపై 'ఈటీవీ భారత్​' ఆరా

By

Published : Jul 22, 2019, 5:19 AM IST

ఇరాన్​ స్వాధీనం చేసుకొన్న బ్రిటన్​ నౌకలోని 18 మంది భారతీయులపై ఈటీవీ భారత్​ ఆరా తీసింది. ఇదే విషయంపై ఇరాన్​ను సంప్రదించగా.. ప్రస్తుతానికి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పందించింది. ఒకవేళ భారతీయుల గురించి తెలిస్తే.. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా వారికి ఎలాంటి హాని కలగకుండా చూస్తామని ఇరాన్​ స్పష్టం చేసింది.

బ్రిటన్‌ చమురునౌక స్టెనా ఇంపెరో ఓ మత్స్యకారుల పడవను ఢీకొన్నందున శుక్రవారం ఇరాన్​ అధీనంలోకి తీసుకుంది. ఆ నౌకలో ఉన్న 23 మంది సిబ్బందిలో 18 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరూ ఇరాన్​ అధికారుల అదుపులోనే ఉన్నారు. నౌకలో ఉన్న భారతీయులను సురక్షితంగా విడిపించేందుకు బ్రిటన్‌, ఇరాన్‌ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ శనివారం తెలిపారు.

అందరూ సురక్షితం..!

తాము స్వాధీనం చేసుకున్న బ్రిటన్‌ నౌకలో ఉన్న 18 మంది భారతీయులు సహా 23 మంది సిబ్బంది సురక్షితంగా, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు అక్కడి స్థానిక వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఈ మేరకు హార్మొజ్గాన్‌ ప్రావిన్స్‌ పోర్ట్‌ అండ్‌ మారిటైమ్‌ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అల్లా మొరాద్‌ అఫిఫిపూర్‌ ప్రకటన చేసినట్లు వెల్లడించాయి.

నిబంధనలు ఉల్లంఘించినందుకే

స్వీడన్‌లోని స్టెనా బల్క్‌ అనే సంస్థకు చెందిన స్టెనా ఇంపెరో నౌకలో భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్‌, లాత్వియా, రష్యా దేశాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయ సముద్ర జల నిబంధనలను ఉల్లంఘించినందునే నౌకను అదుపులోకి తీసుకున్నామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్​ ప్రతినిధులు తెలిపారు.

బ్రిటన్​ మండిపాటు

మరోవైపు తమ నౌకను స్వాధీనం చేసుకోవటంపై బ్రిటన్‌ మండిపడింది. ఇది ఆమోదయోగ్యం కాదని, నౌకామార్గ స్వేచ్ఛను తప్పనిసరిగా కొనసాగించాలని డిమాండ్‌ చేసింది.

ABOUT THE AUTHOR

...view details