పుట్టినరోజు నాడు తిహార్ జైల్లో గడపనున్న చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తన 74వ పుట్టినరోజును జైల్లోనే గడపనున్నారు. సెప్టెంబర్ 16న 74వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత.
ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం సెప్టెంబర్ 19 వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు చిదంబరం. అదే రోజున ట్రయల్ కోర్టులో ప్రవేశపెడుతారు. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అనంతరం.. సెప్టెంబర్ 23న వీటిపై వాదనలు విననుంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు...
యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం.. 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. తర్వాత.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి:'ఐరాస వేదికగా కశ్మీర్‌పై పాక్ ప్రయత్నాలు విఫలం'