ఎలాంటి సమస్య నుంచి అయినా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం భారతీయులకు అలవాటు. ఇప్పుడు మిడతల సంక్షోభంలోనూ ఇదే జరిగేలా ఉంది. తమిళనాడుకు చెందిన ఓ అంకుర సంస్థ.. మిడతల దాడి నుంచి ప్రయోజనం పొందేలా వినూత్న ప్రయత్నం చేస్తోంది. మిడతలను సజీవంగా పట్టుకుని వాటిలోని ప్రోటీన్లను వాడుకోవాలని చూస్తోంది. కోళ్లకు ఆహారంగా అందించాలని లేదా ఎరువుల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది.
ప్రోటీన్లు ఎక్కవ...
కరోనా సంక్షోభం ముగియకుండానే దేశాన్ని మరో సమస్య పట్టి పీడిస్తోంది. అదే మిడతల దండయాత్ర. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న మిడతలు.. ఇప్పటికే వేలాది పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు దక్షిణ భారతంవైపు దూసుకొస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వీపరీతంగా రసాయనాల పిచికారీ చేపడుతున్నాయి. ఇవి మనిషికి హానికరమని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషపూరిత రసాయనాల వాడకం వల్ల మిడతల బాధ తప్పినా.. భూసారం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.
అయితే తమిళనాడు తిరుచిరాపల్లికి చెందిన అంకుర సంస్థ ప్రొపెల్లర్ టెక్నాలజీస్.. మిడతల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని, వాటిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. మిడతలను సజీవంగా పట్టుకుని ఎరువులకైనా, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఆహారంగానైనా అందించాలని చూస్తోంది. ఇందుకోసం సాంకేతికతను వాడుకుంటోంది.
"మిడతల దాడిని ఎదుర్కోవడానికి రసాయనాలను ఎక్కువగా వాడుతున్నారు. పురుగుల మందును భారీ మోతాదులో పిచికారీ చేస్తున్నారు. వీటితో మిడతలు చచ్చిపోవచ్చు కానీ పంట కూడా భారీగా నష్టపోతుంది. మిడతల్లో ప్రోటీన్లు అధికం. దీనిని మనం ఉపయోగించుకోవాలి. మిడతల దాడితో లబ్ధిపొందాలి. ఇందుకోసం సాంకేతికతను వాడుకోవాలి."
-- ఆషిక్ రెహమాన్, ప్రొపెల్లర్ టెక్నాలజీస్.