కరోనా కట్టడికి భారత్ చేస్తున్న కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి ప్రశంసించింది. భౌగోళికంగా, జనాభా పరంగా వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని కొనియాడారు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్. ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచడం, కొవిడ్ ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో భారత్ కీలక చర్యలు చేపట్టిందని అన్నారు.
కరోనా నియంత్రణలో భారతదేశ వ్యూహాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎలా పరిగణిస్తోంది?
దేశంలో భౌగోళికంగా, జనాభా పరంగా సారూప్యతలు ఉన్న నేపథ్యంలో కరోనా నియంత్రణలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కరోనా పరీక్షలు పెంచడం, కొవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేయడం, ఐసోలేషన్ కేంద్రాలు నిర్మించడం, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, పీపీఈ కిట్లు, మాస్కులు, వైద్య ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం లేకుండా చూడడంలో భారత్ ముందు నుంచి ప్రయత్నాలు చేసింది. కరోనా కట్టడికి భారత్ తీవ్రమైన కృషి చేసింది, వీటిని కొనసాగించాలి.
మహమ్మారితో కలిసి జీవిస్తున్నామని మనమంతా గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. పరీక్షలు నిర్వహించడం, రోగులను గుర్తించి ఐసోలేట్ చేయడం, వారికి చికిత్స అందించడం వంటి చర్యలు మరింతగా బలోపేతం చేసుకోవాలి.
ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్న రెండు స్వదేశీ టీకాలతో సహా భారత్‌లో కరోనా వ్యాక్సిన్ విషయాలపై మీ అభిప్రాయం?
ప్రపంచవ్యాప్తంగా 44 వ్యాక్సిన్ క్యాండిడేట్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇందులో భారత్ బయోటెక్, జైడస్ కాడిలా సంస్థల టీకాలూ ఉన్నాయి. ఫేజ్ 3 ట్రయల్స్ కోసం భారత్ బయోటెక్‌కు అనుమతులు లభించాయి. కాడిలా.. ఫేజ్ 2 ట్రయల్స్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు భారత్‌లోని తయారీదారుల భాగస్వామ్యంతో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా 154 వ్యాక్సిన్ క్యాండిడేట్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయి.
కొవిడ్ టీకా ఎప్పుడు వస్తుందని భావించవచ్చు?
ప్రస్తుత పరిస్థితుల్లో టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని చెప్పలేం. ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తయి, ఫలితాలు వెలువడటంపై అంచనాలు ఆధారపడి ఉంటాయి. టీకా సురక్షితమని నిర్ధరించుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. లైసెన్సులు, ఉత్పత్తి సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే 2021 మధ్యలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రావొచ్చు. వచ్చే కొన్ని నెలల్లో సమర్థమైన టీకా లభిస్తే.. 2021 చివరినాటికల్లా అన్ని దేశాల్లో ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన డోసులు సిద్ధమవుతాయి.
కరోనా వ్యాక్సిన్ పంపిణీ, రోగనిరోధకతపై మీ అభిప్రాయం?
సురక్షితమైన, సమర్థమైన వ్యాక్సిన్‌ను రూపొందించాలంటే అన్ని దేశాలు సమన్వయంతో వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. తొలుత వ్యాక్సిన్ లభ్యత పరిమితంగానే ఉంటుంది కాబట్టి టీకా పంపిణీ వ్యూహాలను గుర్తించడం చాలా ముఖ్యం. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చేసేందుకు అధిక ముప్పు కలిగి ఉన్న జనాభాకు ముందుగా టీకా ఇచ్చేలా వ్యూహాలు రూపొందించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.
టీకాలను పర్యవేక్షించడానికి జాతీయ స్థాయి సమన్వయ కమిటీ అవసరం. కొత్త వ్యాక్సిన్ల ఆమోదం కోసం వేగవంతమైన రెగ్యులేటరీ వ్యవస్థ, అధిక ముప్పు ఉన్నవారిని గుర్తించి సిఫారసు చేయడానికి సాంకేతిక సలహా బృందాలు; టీకా వేసే క్రమంలో వైరస్ సంక్రమణ నివారణ, నియంత్రణ చర్యలపై నిబంధనలు రూపొందించడం సహా వ్యాక్సిన్ అందించేందుకు శిక్షణ ప్రణాళికలు వంటివి అవసరమవుతాయి. వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ వ్యవస్థల బలోపేతంపై దేశాలు దృష్టిసారించాలి. భాగస్వామ్య దేశాలతో కలిసి వ్యాక్సిన్ ఇంట్రడక్షన్ రెడీనెస్ అసెస్మెంట్ టూల్(విరాట్)ను డబ్ల్యూహెచ్ఓ అభివృద్ధి చేసింది. కరోనా వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టడం సహా టీకా సంసిద్ధతపై పర్యవేక్షణకు ఈ సాధనం ఉపయోగపడుతుంది.
భారత్‌లో కరోనా రికవరీ రేటు ప్రపంచంలోనే అధికంగా ఉంది. దీనిపై మీరేమంటారు?
ఈ విషయంలో భారతదేశ తీవ్రంగా కృషి చేస్తోంది. పరీక్షల సంఖ్యను పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించడం, ఐసోలేషన్, అవసరమైన వారికి ఆస్పత్రిలో వైద్యసేవలు అందించడానికి గొప్పగా ప్రయత్నిస్తోంది. కానీ మహమ్మారి సమస్య ఇంకా సమసిపోలేదు. కొవిడ్ వ్యాప్తి కట్టడికి చేస్తున్న చర్యలు ఇంకా శక్తిమంతంగా ఉండాలి.
పండుగలను కరోనాకు సూపర్ స్ప్రెడర్లుగా అభివర్ణిస్తున్నారు. దీనిపై మీ దృష్టికోణం ఏంటి?
కరోనా పరీక్షలు నిర్వహించడం, బాధితులను గుర్తించి ఐసోలేట్ చేయడం, చికిత్స అందించడం ప్రభుత్వాలు విధిగా పాటించాలి. అదేసమయంలో వ్యక్తిగతంగా మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి. సురక్షిత దూరం పాటించి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైన చోటల్లా మాస్కులు ధరించాలి. రద్దీగా ప్రదేశాలకు వెళ్లకూడదు. గాలి సరిగా ఆడని, మూసి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలి. శీతకాలం సమీపిస్తోంది కాబట్టి అదనపు జాగ్రత్తలు పాటించాలి. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతాయి కాబట్టి.. వైద్య వ్యవస్థపై అధికంగా భారం పడకుండా చూసుకోవాలి.