తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో 6 నెలల 'నెట్​ బంద్'​​ ఎంతవరకు సరి? - Centre for Internet and Society

జాతీయ భద్రత, పౌర హక్కులు... ప్రజాస్వామ్య దేశంలో అతి కీలకమైనవి. రెండింటికీ సమప్రాధాన్యం అత్యవసరం. అయితే... జమ్ముకశ్మీర్​లో అంతర్జాలం నిలిపివేత విషయంలో ఈ సమతుల్యం దెబ్బతిందా? దేశ భద్రత పేరు చెప్పి పౌర హక్కులను కేంద్రం కాల రాసిందా? ఔననే అంటున్నారు 'సెంటర్​ ఫర్​ ఇంటర్​నెట్​ అండ్​ సొసైటీ' ప్రతినిధి గుర్షాబాద్ గ్రోవర్. 'నెట్​ బంద్​'తో కశ్మీరీలకు తీరని అన్యాయం జరుగుతోందని అంటున్న ఆయన విశ్లేషణాత్మక వ్యాసం మీకోసం...

Internet shutdowns - its legal and commercial dimensions in Kashmir
కశ్మీర్​లో 6 నెలల 'నెట్​ బంద్'​​ ఎంతవరకు సరి?

By

Published : Feb 13, 2020, 7:19 PM IST

Updated : Mar 1, 2020, 6:00 AM IST

అంతర్జాలం... ప్రస్తుతం నిత్యావసరం. విద్య, వైద్యం, వినోదం...ఇలా ప్రతి విషయానికీ ఎంతో కీలకం. అలాంటి ఇంటర్​నెట్​ లేకుండా మీరెంత కాలం బతకగలరు? సాధారణంగా అయితే ఒకటి, రెండు రోజులు అని చెప్పడం కూడా కష్టమే. కానీ... జమ్ముకశ్మీర్​ ప్రజలు మాత్రం దాదాపు ఆరున్నర నెలలుగా డిజిటల్ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. ఇటీవల ఇంటర్​నెట్​ సేవల్ని అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా... యాక్సెస్​ చేయగలిగిన సైట్లు చాలా తక్కువ.

అలా మొదలు...

2019 ఆగస్టు 4.... ఆర్టికల్​ 370 రద్దుకు ఒక్క రోజు ముందు. జమ్ముకశ్మీర్​లో అంతర్జాల సేవలు నిలిపివేయాలని ఆదేశించింది కేంద్రప్రభుత్వం. ఈ డిజిటల్ బంద్... దాదాపు కోటి మందిపై ప్రభావం చూపింది. అయినా... మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కశ్మీరీలు. ఎందుకంటే... 'నెట్​ బంద్' వారికి కొత్త కాదు. గత ఏడేళ్లలో 180 సార్లు పాక్షికంగానో, పూర్తిగానో కశ్మీర్​లో అంతర్జాలాన్ని నిలిపివేసినట్లు చెబుతోంది 'సాఫ్ట్​వేర్​ ఫ్రీడం లా సెంటర్​ ఇంటర్నెట్​ షట్​డౌన్​ ట్రాకర్'​. కానీ... కశ్మీరీలకు తర్వాత అర్థమైంది. మరే ప్రజాస్వామ్య దేశంలోనూ లేనంత సుదీర్ఘ కాలంపాటు అంతర్జాల నిషేధాన్ని ఎదుర్కోబోతున్నట్లు అవగతమైంది.

అంతర్జాలం... జీవితంలో అంతర్భాగం...

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్​ ఒక నిత్యావసర సాధనంగా మారిందన్నది వాస్తవం. అంతర్జాల సేవలు.. ఆర్థిక, సామాజిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. వాటిని నిలిపివేస్తే ఎన్నో కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. విద్యార్థులు వారికి విలువైన విద్యా వనరులు కోల్పోతారు. ఆసుపత్రులు, ఇతర అత్యవసర సేవల విభాగాలకు తీరని నష్టాన్ని మిగులుస్తాయి. స్థానిక వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా క్షీణిస్తాయి.

అంతర్జాలంపై నిషేధం ద్వారా కూడా సాధారణ, శాంతియుత పరిస్థితుల్ని సృష్టించవచ్చని చెబుతున్న ప్రభుత్వాన్ని తప్పుబట్టారు పరిశోధకుడు జాన్​ రిడ్​జాక్​. శాంతియుత నిరసనలు ప్రదర్శించేందుకు ప్రజల మధ్య సమన్వయం కోసం ఇంటర్నెట్​ తప్పనిసరి అని.. ఇలా అంతర్జాలం నిలిపివేస్తేనే అల్లర్లు హింసాత్మకంగా మారే పరిస్థితులు వస్తాయని విశ్లేషించారు.

సుప్రీం జోక్యంతో...

కశ్మీర్​ టైమ్స్​ ఎడిటర్​ అనురాధ భాసిన్ పిటిషన్​తో 'నెట్ బంద్' వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అంతర్జాలంపై నిషేధం సహా కశ్మీర్​లో విధించిన వేర్వేరు ఆంక్షల్ని సవాలు చేశారామె. ఇక్కడే కేంద్రప్రభుత్వం చట్టానికి అతీతంగా వ్యవహరించిన తీరు బయటపడింది. అంతర్జాల నిషేధానికి సంబంధించిన ఉత్తర్వుల్ని న్యాయస్థానం ముందు ఉంచడంలో విఫలమైంది ఎన్డీఏ సర్కార్.

'నెట్​ బంద్​'పై జనవరి 10న కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ''ఇంటర్నెట్​ ద్వారా భావప్రకటన, వృత్తి, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్​ 19 రక్షణ కల్పిస్తుంది. అంతర్జాలం ఇటీవలి కాలంలో అత్యవసరంగా మారింది. సమాచార వ్యాప్తికి ఇదో ప్రధాన వనరు'' అని ఉద్ఘాటించింది. నిరవధికంగా అంతర్జాలాన్ని నిలిపివేయడం తగదని, ప్రతి వారం సమీక్షించి తగిన చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. తద్వారా... భవిష్యత్తులో ఇలాంటి ఆంక్షలపై గట్టి హెచ్చరికలు పంపింది. అయితే... ఇంటర్నెట్​ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఆదేశించినా... కశ్మీరీలకు పూర్తిస్థాయి ఊరట లభించలేదన్నది విశ్లేషకుల వాదన.

పునరుద్ధరించారు కానీ...

సుప్రీం కోర్టు తీర్పుతో జమ్ముకశ్మీర్​ ప్రభుత్వం క్రమంగా చర్యలకు ఉపక్రమించింది. స్వల్పకాలంలోనే 2జీ ఇంటర్నెట్​ సేవలను పునరుద్ధరించింది. అయితే ఇక్కడా మెలిక పెడుతూ 301 వెబ్​సైట్లకు మాత్రమే యాక్సెస్ కల్పించింది. సమాచార వ్యాప్తికి ప్రధానంగా ఉపయోగపడే వెబ్​సైట్లు బ్లాక్ చేసే ఉంచింది. మొత్తంగా... ప్రభుత్వం రూపొందించిన 301 వెబ్​సైట్ల వైట్​లిస్ట్​లో పనికొచ్చేవి 126 మాత్రమేనని ఓ అధ్యయనంలో తేలింది.

వీపీఎన్​తో అడ్డదారి...

అయితే.. ఆ వైట్​లిస్ట్​ను తప్పించుకునేందుకు కశ్మీరీలు వర్చువల్​ ప్రైవేట్​ నెట్​వర్క్​(వీపీఎన్​) మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పసిగట్టేందుకు ఎంతో కాలం పట్టలేదు. అందుకే వీపీఎన్​ అప్లికేషన్లను తొలగించాలని కశ్మీరీలను భద్రతా దళాలు హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి వీపీఎన్​ల వాడకాన్ని అడ్డుకునే చట్టం లేదు.

కశ్మీర్​లో టెలికాం సేవలు, ఇంటర్నెట్​ నిలిపివేతపై ఆంక్షలు విధించి ఇప్పటికి 6 నెలలు దాటింది. కశ్మీరీలకు తమ ప్రాథమిక హక్కులను దీర్ఘకాలికంగా దూరం చేసే ఈ తప్పును.. బహుశా భవిష్యత్తులోనూ సరిదిద్దలేం. ఇలా పాక్షికంగా సేవలు పునరుద్ధరించడం కన్నా ప్రభుత్వం మరింత మెరుగైన చర్యలు తీసుకోవడం ఉత్తమం. ప్రపంచమంతా మనల్ని గమనిస్తోందని గుర్తించాలి. జాతీయ భద్రత పేరిట పౌర హక్కుల్ని కాలరాసే వారిని చరిత్ర ఎన్నటికీ క్షమించదని గుర్తుంచుకోవాలి.

(రచయిత- గుర్షాబాద్​ గ్రోవర్, సెంటర్​ ఫర్​ ఇంటర్​నెట్​ అండ్​ సొసైటీ)

Last Updated : Mar 1, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details