దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ అమల్లో ఉంది. రవాణా స్తంభించింది. కాలుతీసి బయట పెట్టే పరిస్థితి లేదు. కాదని వెళ్తే కేసులు నమోదవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తప్పనిసరిగా ఇళ్లల్లోనే ఉంటున్నారు.
తీరిక లేని జీవితాలకు కాస్త ఉపశమనం కలిగేలా... కుటుంబం మొత్తం ఒకే చోట కాలక్షేపం చేస్తున్నారు. చాలామంది ఇంటర్నెట్‌లో కాలం వెళ్లదీస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైన దగ్గర నుంచి కామెడీ షోలు, సినిమాలు, సీరియళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.
అంతా ఆన్‌లైన్‌లోనే...
దేశ వ్యాప్తంగా అన్నీ మూతపడినా కొన్ని సంస్థలు మాత్రం కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. వీరందరినీ ఇళ్ల నుంచి పనిచేసేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూ కొన్ని మినహాయింపులు ఇచ్చాయి.
దూరం పాటించాల్సి రావడం... రవాణా సదుపాయాలు లేకపోవడంవల్ల ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. దేశంలోని విద్యాసంస్థలూ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. వీడియో పాఠాలు అప్‌లోడ్ చేస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు మొత్తంగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. నగదు చలామణి చాలా వరకు తగ్గి.. డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి.
చైనా తర్వాత..
దేశవ్యాప్తంగా దాదాపు 69 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు రెండున్నర కోట్ల మంది బ్రాడ్ బ్యాండ్ వినియోగిస్తుండగా.. మిగిలిన వారంతా మొబైల్ నెట్ వినియోగదారులే. చైనా తర్వాత ఈ స్థాయిలో వినియోగిస్తున్న దేశం భారత్. గత కొన్నేళ్ల నుంచి దేశీయ టెలికాం రంగం శరవేగంగా అభివృద్ధి సాధిస్తుండడం ఇందుకు కారణం.
పెరుగుతున్న వినియోగం..
గతంతో పోల్చితే డేటా వినియోగం సగటున 30% పెరిగిందని అంటున్నాయి దేశీయ టెలికాం సంస్థలు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో అయితే సరాసరి 70% వినియోగం పెరిగిందని చెబుతున్నాయి.
సరిగ్గా అదను చూసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త ఎత్తుగడలు వేస్తూ.. నెట్‌జన్లపై మోసాల వల విసురుతున్నారు. వివిధ రకాలుగా బురిడీలు కొట్టిస్తున్నారు. ఈ దెబ్బతో లాక్‌డౌన్ మొదలైన దగ్గర నుంచి ఇతర నేరాలు తగ్గుముఖం పట్టగా సైబర్ నేరాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి.
కరోనా పేరుతో మోసాలు..
ప్రజలు ఎక్కువగా కరోనా విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. సైబర్ కేటుగాళ్లు ఆ పేర్లతో వెబ్ సైట్లు రూపొందిస్తున్నారు. కరోనా గురించిన సమాచారాన్ని ఇచ్చే సైట్లతో పాటు.. అప్‌డేట్స్, విరాళాలు ఇచ్చే సంస్థలు, అంతర్జాతీయ సంస్థలుగా సైట్లను రూపొందించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ బూచోళ్లు.
వీటిలో కొన్నింటిని గుర్తించిన పోలీసులు ఆ జాబితానూ విడుదల చేశారు. ఈ సమయంలోనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు నిపుణులు. అజాగ్రత్తగా ఉంటే ఉద్యోగుల వ్యక్తిగత సమాచారంతో సంస్థల వివరాలు సైతం సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఏం చేయాలి..?
- ఇప్పటి వరకు ఉన్న పాస్‌వర్డ్‌ను మార్చి సురక్షిత పాస్ వర్డ్ ను ఎంచుకోవాలి.
- రూటర్లను సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉండడం వల్ల నిర్ణీత సమయం తర్వాత కొత్తగా పాస్‌వర్డ్ పెట్టేలా రిమోట్ సెషన్ ఉపయోగించాలి.
- రిమైండ్ పాస్‌వర్డ్‌ను ఎట్టిపరిస్థితుల్లో వాడవద్దు.
- సంస్థల వ్యాపార, ట్రేడ్, పరిశోధనలు లాంటి పనుల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరు ఈ సమయంలో ఇతర యాప్‌లు, అప్‌డేట్‌ల జోలికిపోకపోవడమే ఉత్తమం.
- ఉద్యోగులైతే వారు వాడే అంతర్జాలాన్ని ఇంట్లో ఉండే ఇతర ఉపకరణాలతో అనుసంధానించకుండా వేరుగా ఉంచాలి.
జాగ్రత్త అవసరం..
ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్న ప్రజలు.. వ్యక్తిగత సమాచారం కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సమాచారాన్ని.. సంస్థల రహస్యాలు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్త వహించాలి.
ఇదీ చూడండి:కరోనా మహమ్మారిపై పోరుకు రోబో అస్త్రం!