ఒక మహమ్మారి ‘కొత్త’గా కల్లోలం రేపుతోంది. దాని ఆనుపానులు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్‌కు ఇంకా మందు రాలేదు. దీన్ని తయారుచేయడానికి ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఈ దశలో కరోనా ఎంత ప్రమాదకరమో.. అది ఎలా పంజా విసురుతుందో.. దీన్ని ఎలా ఆపగలమో ప్రతి పౌరుడూ తెలుసుకోవాలి. ఇలాంటి వైరస్‌ల నివారణకు ప్రజల అప్రమత్తత అత్యంత కీలకం అంటున్నారు ప్రఖ్యాత వైరాలజీ నిపుణుడు పీటర్ పయెట్. జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది అదుపుచేయలేని పరిస్థితికి చేరుకోవచ్చునని ఆయన హెచ్చరిస్తున్నారు.
వైరస్‌లు, టీకాలు, మందులు, వాటి నివారణపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న పయెట్ అమెరికాకు చెందిన, వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్న ప్రఖ్యాత ‘టెడ్‌మెడ్ ఫౌండేషన్’ నిర్వహించిన ముఖాముఖిలో ఎన్నో అంశాలను వెల్లడించారు.
వైరస్‌ల వేటగాడు పీటర్ పయెట్
వైరస్‌ల గుట్టుమట్లు తేల్చడంలో, వాటి ఆట కట్టించడంలో దిట్ట పీటర్ పయెట్. ‘వైరస్‌ల వేటగాడు’ అని కూడా అయనకు పేరు. 1949లో బెల్జియంలో జన్మించిన పయెట్ ఇదే పనిలో దేశాలను చుట్టేస్తున్నారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించారు. 1976లోనే ఎబోలా వైరస్‌ను కనుగొనడంలో కీలక భూమిక పోషించారు. ఎబోలా, ఎయిడ్స్ నియంత్రణకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రముఖ దాతృత్వ సంస్థలు ఫోర్డ్, మిలిందా-గేట్స్ ఫౌండేషన్లతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా 600 పరిశోధక వ్యాసాలు, 17 పుస్తకాలు రాశారు. ఆరోగ్య, ఔషధ రంగాల్లో పరిశోధనలకు ఎన్నో అవార్డులు పొందారు. ప్రస్తుతం లండన్‌లోని పరిశుభ్రత, ఉష్ణమండల వ్యాధుల అధ్యయన సంస్థకు సంచాలకుడిగా పనిచేస్తున్నారు.
సూక్ష్మాతి సూక్ష్మం
కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఎందుకు కష్టమవుతోంది
ఇది పరిమాణం రీత్యా అత్యంత సూక్ష్మమైనది. ఎంత చిన్నదంటే ఒకసారి దగ్గితే గాల్లోకి వచ్చే తుంపర్లలో ఈ వైరస్‌లు కొన్ని వందల కోట్లలో ఉంటాయి. ఒక సూదిమొనపై 10 కోట్లు వరకూ ఉంటాయంటే ఎంత సూక్ష్మమో అర్ధం చేసుకోవచ్చు.
ఈ వైరస్ చూడటానికి ఎలా ఉంటుంది
‘సార్స్-కొవ్2’గా పిలిచే ఈ వైరస్ ఒక నూడుల్ లాంటి చిన్నపోగును ఒక బంతిలో ప్యాక్ చేసినట్లుంటుంది. అంతా ప్రొటీన్‌తో తయారై ఉంటుంది. ఆ గోళాకృతిపై చిన్న మొనల్లాంటి ఆకృతులు(స్పైక్స్) ఉంటాయి. మొత్తంగా చూస్తే సూర్యుడి బాహ్యవలయం ‘కరోనా’ మాదిరిగా కనిపిస్తుంటుంది. నిజానికి ఈ జాతికి చెందిన వైరస్‌లన్నీ ఇలాగే కనిపిస్తాయి.
రోగ నిరోధకం?
దీన్ని ‘నావెల్’ కరోనా వైరస్ అని ఎందుకు పిలుస్తున్నారు
ఇక్కడ నావెల్ అంటే మనుషులకు ‘కొత్తగా’ సోకుతున్న వైరస్ అని అర్థం. అంటే ఇంతకుముందు మనం దీన్ని చూడలేదు. మన రోగనిరోధక వ్యవస్థ 20 లక్షల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ వస్తోంది. కానీ మునుపెన్నడూ ఇలాంటి వైరస్‌ను చూడలేదు. అందువల్ల ఈ వైరస్‌కు రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేకపోయింది. ప్రస్తుతానికి దీన్ని ఎదుర్కొనే శక్తిని మన రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చేసుకోలేకపోవడంతో పాటు వైరస్ కూడా శక్తిమంతమైంది కావడంతో సులువుగా వ్యాప్తి చెందగలుగుతోంది. ఇది ప్రమాదకరంగా మారడం వల్లే ఎక్కువ కల్లోలం సృష్టిస్తోంది.
కొత్త వైరస్ ఎంత సులువుగా వ్యాప్తి చెందుతుంది
దగ్గు తుంపర్లు, స్పర్శ ద్వారా ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులువుగా వ్యాప్తి చెందుతుంది. ఇది శ్వాస సంబంధిత మార్గాల ద్వారా వ్యాప్తి చెందే వైరస్.
ఎలాంటి లక్షణాలు లేకుండానే కొందరు ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారా
దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది. ఈ వైరస్ సోకిన చాలామందిలో తొలి కొద్దిరోజులు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత కొద్దిగా దగ్గు లేదా స్వల్పంగా జ్వరం కనిపిస్తుంది. సార్స్ ఇలా కాదు. సార్స్ వైరస్ సోకితే కొద్ది రోజులు తీవ్ర లక్షణాలు ఉంటాయి. ఇది సోకిన వాళ్ల నుంచి అప్పుడే ఇతరులకు అంటుతుంది.
7 రకాలు
ఎన్ని రకాల కరోనా వైరస్‌లు మనుషులపై ప్రభావం చూపిస్తుంటాయి
మొత్తం 7 రకాల కరోనా వైరస్‌లు మనిషి నుంచి మనిషికి సోకుతుంటాయి. వీటిలో 4 అంత ప్రమాదకరమైనవేమీ కావు. వీటిద్వారా కొంచెం జలుబు వచ్చి తగ్గిపోతుంది. మిగతా 3 రకాలు మాత్రం ప్రమాదకరమైనవి. అవే సార్స్, మెర్స్, ప్రస్తుతం విస్తరిస్తున్న కొత్త వైరస్ సార్స్-కొవ్2.
మరణాల రేటు
కొత్త వైరస్ ఎంత ప్రమాదకరం
కరోనా సోకినవారిలో 1-2 శాతం మందిలో మరణాలు సంభవిస్తున్నట్లు ఎక్కువమంది శాస్త్రవేత్తలు అంచనాకొస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మరణాల రేటు 3 శాతానికి పైగా ఉండొచ్చని చెబుతోంది. అయితే నమోదుకాని, స్వల్పస్థాయి కేసులను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరణాల శాతం ఇంతకంటే తక్కువే ఉండే అవకాశం ఉంది. వయోవృద్ధులు, ఇతరత్రా ఆరోగ్య పరిస్థితులున్న వారిలోనూ మరణాల రేటు 10-15% వరకు ఉంటోంది. వృద్ధులతో పాటు మధుమేహం, తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు ఎందుకు అధికంగా ప్రభావితం అవుతున్నారనే విషయాన్ని కనుగొనడానికి కొంత సమయం పట్టొచ్చు.
తీవ్రత స్థాయి
తట్టు, అమ్మవారు, గవద బిళ్లలతో పోలిస్తే కొత్త వైరస్ ఎంత ప్రమాదకరం?
ఇప్పటికైతే తట్టు, అమ్మోరు, గవద బిళ్లలతో పోలిస్తే కరోనా తక్కువ అంటువ్యాధే. ఇది కొత్త వైరస్ కావడం, దాని గురించి ఏమీ తెలియకపోవడం, మందులు లేకపోవడం వల్ల భయాందోళనలు పెరుగుతున్నాయి.
జ్వరం రాకున్నా కొవిడ్ సోకుతుందా
చైనాలో నమోదైన కేసుల్లో 30% మందికి జ్వరమే రాలేదు. వారు ఆసుపత్రులకు వెళితేనే అసలు విషయం తేలింది. కొవిడ్ సోకిన వారిలో 20 శాతం మందిలో మాత్రమే తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి వారిలో అధిక జ్వరం, పొడిదగ్గు, నీళ్ల విరేచనాలు, శ్వాస సమస్యలతోపాటు ఊపిరితిత్తులు వాచిపోతాయి. అలాంటివారు తప్పక ఆస్పత్రిలో చేరాలి. వీటిలో రెండు కంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నియంత్రణ మార్గం
‘వ్యాప్తి తీవ్రతను తగ్గించడం’ అంటే ఏమిటి
అమెరికా లాంటి దేశాల్లో వైరస్ సోకిన వారి సంఖ్య ప్రతి వారం రెట్టింపవుతోంది. ఇలాంటి కొత్త మహమ్మారి ప్రబలుతున్నప్పుడు దాని ‘వ్యాప్తి తీవ్రతను తగ్గించడం’ చాలా అవసరం. వైరస్ విజృంభించి అదుపుచేయలేని పరిస్థితి ఏర్పడితే ఆసుపత్రులు, సహాయ కేంద్రాలు సరిపోవు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాల్లో ఇదే పరిస్థితి.