తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడు ఎవరో తెలుసా? - Dr sachhidananda sinha

రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికవడానికి ముందే.. మధ్యంతర అధ్యక్షుడిగా డాక్టర్​ సచిదానంద సిన్హా పనిచేసిన విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ప్రత్యేక బిహార్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సిన్హాను 1946 డిసెంబరు 9న భారతదేశ రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఆనాటి కాంగ్రెస్​ అధ్య​క్షుడు ఆచార్య జేబీ కృప్లానీ. ఆ తర్వాత రెండు రోజులకే 1946 డిసెంబరు 11న డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​.. రాజ్యాంగ పరిషత్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడు ఎవరో తెలుసా?

By

Published : Nov 26, 2019, 8:41 AM IST

భారతదేశ రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నిస్తే మనలో చాలామంది డాక్టర్​ బాబూ రాజేంద్రప్రసాద్​ అని టక్కున సమాధానం చెప్తారు. మరి ఆయన కంటే ముందే రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా సేవలందించిన వ్యక్తి ఎవరు? అని ప్రశ్నిస్తే..!! బహుశా చాలామందికి ఆయన పేరు కూడా తెలియకపోవచ్చు. ఆయనే బిహార్​కు చెందిన డాక్టర్​ సచిదానంద సిన్హా.

సిన్హాను మాజీ రాష్ట్రపతి డాక్టర్​ బాబూ రాజేంద్ర ప్రసాద్​... 'ఫాదర్​ ఆఫ్ ​ద మోడర్న్​ బిహార్​'గా కీర్తించారు. అలాంటి వ్యక్తిని 1946 డిసెంబరు 9న భారతదేశ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఆనాటి కాంగ్రెస్​ అధ్య​క్షుడు ఆచార్య జేబీ కృప్లానీ. మరి ఆయన ఎవరో? రాజ్యాంగ పరిషత్​ అధ్యక్షుడిగా ఎలా ఎదిగారో చూద్దాం..

సిన్హా బాల్యం

సచిదానంద సిన్హా 1871 నవంబరు 10న బిహార్​లోని బక్సర్ జిల్లా మహర్షి విశ్వామిత్రా మురార్​ గ్రామంలో జన్మించారు. సిన్హా తండ్రి బక్సి శివప్రసాద్​ సిన్హా.. దుమరన్​ మహరాజ్ ముఖ్య తహశీల్దార్​గా ఉండేవారు. సిన్హా ప్రాథమిక విద్య అంతా ఆయన స్వగ్రామంలోనే గడిచింది. 1889 డిసెంబరు 26న 18 ఏళ్ల వయసున్నప్పుడు బారిస్టర్​ అభ్యసించేందుకు ఇంగ్లాండ్​కు వెళ్లారు సిన్హా. 1893లో కోల్​కతా హైకోర్టులో న్యాయవాది​గా వృత్తిజీవితం​ ప్రారంభించారు. ఆ తర్వాత అలహాబాద్​ హైకోర్టులో 10ఏళ్లు లాయర్​గా కొనసాగారు. అదే సమయంలో ఇండియన్ పీపుల్స్​, హిందుస్థాన్ రివ్యూ పత్రికలకు సంపాదకులుగా చాలా సంవత్సరాలు సేవలందించారు.

రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా..

1946లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు ప్రకటించింది బ్రిటీష్​ ప్రభుత్వం. అదే ఏడాది డిసెంబరు 9న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలందరూ దిల్లీలోని పార్లమెంటు హాలులో సమావేశమయ్యారు. చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొన్న అదే సమావేశంలో రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా పేరును ప్రతిపాదించారు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కృప్లానీ. అందుకు అందరూ అంగీకరించినందున సిన్హాను మధ్యంతర అధ్యక్షుడిగా నియమించారు.

జస్టిస్ ఖుదా బక్స్​ ఖాన్​ గ్రంథాలయం

1894లో అలహాబాద్​ హైకోర్టులో న్యాయవాదిగా శిక్షణ పొందుతున్న సమయంలో.. జస్టిస్​ ఖుదా బక్స్​ ఖాన్​ను కలిశారు సిన్హా. జస్టిస్​ ఖాన్​.. 1891 అక్టోబరు 29న ఆయన పేరుమీద పట్నాలో గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత జస్టిస్​ ఖాన్​.. హైదరాబాద్​లోని నిజాం హైకోర్టుకు బదిలీ అయ్యారు. అనంతరం 1894 నుంచి 1898 వరకు ఖాన్​ కార్యదర్శిగా గ్రంథాలయ బాధ్యతలు నిర్వర్తించారు సిన్హా.

ప్రత్యేక బిహార్ ఉద్యమం

ఒకప్పుడు బెంగాల్ ప్రావిన్స్​లో భాగంగా ఉన్న ఇప్పటి బిహార్​ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు సచిదానంద సిన్హా. జర్నలిజాన్ని ఆయుధంగా చేసుకుని.. ద బిహార్​ హెరాల్డ్​ పత్రికతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఆ తర్వాత 1894లో ద బిహార్​ టైమ్స్​ పేరుతో ఒక ఇంగ్లీష్​ పత్రికను స్థాపించారు సిన్హా. 1906లో అదే పత్రికను 'బిహారీ'గా పేరు మార్చారు. ప్రత్యేక బిహార్​ కోసం హిందూ, ముస్లింలు ఏకం కావాలని ఈ పత్రిక ద్వారా నినదించారు. ఆ తర్వాత 1905లో బంగాల్​ నుంచి విడిపోయి ప్రత్యేక బిహార్​ రూపుదిద్దుకుంది.

సిన్హా గ్రంథాలయం.. మరణం

ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఆకాంక్షతో ఆయన భార్య స్వర్గీయ రాధికా సిన్హా జ్ఞాపకార్థం 1924లో గ్రంథాలయాన్ని నెలకొల్పారు సిన్హా. ఈ లైబ్రరీ కార్యకలాపాలు చూసుకునేందుకు ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. అనంతరం 1950 మార్చి 6న పట్నాలో తుది శ్వాస విడిచారు సిన్హా.

ABOUT THE AUTHOR

...view details