మహారాష్ట్ర పుణె జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వానతో పుణె వరద గుప్పిట్లో చిక్కుకుంది. వరదల కారణంగా పుణె జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 17 మంది మరణించారు. లోతట్టు ప్రాంతాల్లోని 16వేల మందిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వీధుల్లో విధ్వంసం
వరద విధ్వంసకాండకు పుణె వీధులు ప్రతిరూపంగా నిలిచాయి. ఇళ్ల వద్ద నిలిపిన వాహనాలు వరదకు కొట్టుకుపోయాయి. అనేక వాహనాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. మురుగు కాలువలు నదులను తలపిస్తుండగా.. వాటిలో ఎక్కడికక్కడ వాహనాలు చిక్కుకుపోయాయి. వీధుల్లో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయింది. భారీ వర్షాల కారణంగా పుణెలో పాఠశాలలు, కలశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు.