ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా సుఖోయ్ యుద్ధవిమానాల్లోకి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేసింది. రక్షణ ప్రాజెక్టుల్లో భాగంగా 40 సుఖోయ్ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణులను అనుసంధానిస్తున్నారు.
పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడుల అనంతరం సుమారు ఆరు వారాల తరువాత ఈ వ్యూహాత్మక కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
హిందుస్థాన్ ఏరోస్పేస్ లిమిటెడ్ (హాల్), బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఏపీఎల్)ల ఆధ్వర్యంలో ఇండో-రష్యా దేశాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. 2020 డిసెంబర్ లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. గడువు ముగిసేలోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు.
సుఖోయ్ యుద్ధ విమానాలతో బ్రహ్మోస్ క్షిపణుల అనుసంధానం జరిగితే వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది. సముద్రంపైనా, భూమిపైనా సుదూర లక్ష్యాలను ఛేదించే బలం వైమానిక దళానికి చేకూరుతుంది.