కేరళలో మరో ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు ఆ గజరాజుకు చికిత్స అందించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇతర ఏనుగులతో జరిగిన పోరాటంలో ఈ గజరాజు తీవ్రంగా గాయపడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
తీవ్రంగా గాయపడి, బలహీనపడ్డ ఏనుగును గతవారం మలప్పురం జిల్లాలోని అర్థలకున్ను ప్రాంతంలో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే చికిత్స మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. ఏనుగుపై ఉన్న గాయాలు మనిషి చేసినవి కాదని మన్నర్కడ్ విభాగ అటవీశాఖ అధికారి సజికుమార్ స్పష్టం చేశారు.
"తొలుత ఏనుగు ఆరోగ్యం కొంతమేర కుదుటపడింది. కానీ గజరాజును రక్షించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇతర ఏనుగులతో జరిగిన పోరాటంలో ఈ ఏనుగు గాయపడి ఉండొచ్చు. ఏనుగును పరీక్షించిన వైద్యులు కూడా ఇదే చెప్పారు. గజరాజు నాలుక, ఉదరంపై తీవ్రంగా గాయాలయ్యాయి."