బంగాల్లో రాజకీయ వేడి రాజుకుంది. మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార పార్టీలో అసంతృప్తి సెగలు బయడపడుతున్నాయి. అంపన్ తుపాను పునరుద్ధరణ కార్యక్రమాలు సహా కరోనాను కట్టడిలో ప్రభుత్వం తీరుపై తృణమూల్ కాంగ్రెస్‌లోని కీలక నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్ ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపిన విషయం స్పష్టమైంది. ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు పార్టీ మారడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఫలితంగా 42 స్థానాలకు గానూ 22 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుంది. అనూహ్యంగా భాజపా 18 సీట్లు గెలుచుకుంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన పోటీదారుగా భాజపా ఎదురునిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు ముందే పార్టీలో పరిస్థితులు చక్కదిద్దుకోవడం దీదీకి చాలా ముఖ్యం.
నేతల అసంతృప్తి
ఎన్నికల వేళ పార్టీలో అసంతృప్తులు, అభిప్రాయ భేదాలు దీదీకి సవాల్ విసురుతున్నాయి. సీనియర్ నేతలైన సధాన్ పాండే, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎంపీ మహువా మోయిత్రా వంటి కీలక నేతల వ్యవహారం టీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. అంపన్‌ను ఎదుర్కోవడంపై వీరంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సొంత ప్రభుత్వంపైనే విమర్శలు
అంపన్ పునరుద్ధరణ కార్యక్రమాల్లో పార్టీ అధికారంలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పాత్ర ఏంటో చెప్పాలని పాండే ప్రశ్నించగా.. తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఉత్తర, దక్షిణ పరగణాల సహాయ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు కనిపించకపోవడంపై ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీఎంసీ జాతీయ ప్రతినిధి మోయిత్రా అయితే ఏకంగా తన నియోజకవర్గం క్రిష్ణానగర్లో పంచాయతీల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక లేని పనులు, స్థానిక నేతల అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
"ఇలాంటి సీనియర్ నాయకులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిచేవే. నేతలు తమ అభిప్రాయాలను చెప్పాలని పార్టీ ఆదేశించకున్నా... ప్రజల మధ్య అలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణమేంటి? వారేదైనా సందేశం ఇస్తున్నారా అనే విషయంపై పరిశీలన చేయాలి."
-టీఎంసీ సీనియర్ నేత
ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. తన వెంటే ఉండి పార్టీని బలహీనపరిచే బదులు పార్టీ విడిచివెళ్లాలంటూ నేతల పేర్లు చెప్పకుండా వ్యాఖ్యానించారు. అయినా పార్టీలో పరిస్థితి మాత్రం మారినట్లు కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అందివచ్చిన అవకాశం
టీఎంసీలో అసమ్మతి రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అధికార పార్టీ నేతలను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన భాజపా నేత ముకుల్ రాయ్ ఈ బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఎంసీలోని కీలక నేతలు, ఎన్నికైన ప్రతినిధులను భాజపాలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ముకుల్. కొంత మంది అగ్రశ్రేణి టీఎంసీ నాయకులు తనతో సంప్రదింపులు చేస్తున్నారని ఇప్పటికే స్పష్టం చేశారు.
"మరికొద్దిరోజుల్లో వారు(టీఎంసీ నేతలు) భాజపాలో చేరతారు. కొన్ని నెలల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పేక మేడలా కూలిపోవడం మీరు చూస్తారు."