తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 2:01 PM IST

ETV Bharat / bharat

'రఫేల్ రాక.. ఆ దేశాలకు గట్టి హెచ్చరిక'

ఐఏఎఫ్‌లోకి రఫేల్‌ విమానాల చేరికతో భారత్‌పై దుస్సాహసం ప్రదర్శించాలనుకునే వారికి గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయిందని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్. జాతీయ భద్రతే భారత మొదటి ప్రాధాన్యమని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

Induction of Rafale jets into IAF crucial considering atmosphere on border: Rajnath
'రఫేల్ రాక ఆ దేశాలకు గట్టి హెచ్చరిక'

రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. భారత వైమానిక దళంలోకి ఐదు రఫేల్‌ యుద్ధ విమానాల చేరిక కార్యక్రమంలో ఆయన ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లెతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హరియాణాలోని అంబాలా వైమానిక దళ కేంద్రం వేదికైంది.

రఫేల్‌ విమానాలను అధికారికంగా ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టిన అనంతరం రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. భవిష్యత్తులోనూ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. దేశానికి రక్షణ పరంగా ఇదో చారిత్రక ఘట్టం. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్‌కు రక్షణ పరంగా రఫేల్‌ విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. దేశీయ రక్షణరంగ పరిశ్రమను ప్రోత్సహించేలా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్‌ను ఆహ్వానించాం. భారత్​లో రక్షణ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలు అనుమతిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఫ్రాన్స్‌ వినియోగించుకుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

జాతీయ భద్రతకే మా ప్రాధాన్యం

వాయుసేనలోకి రఫేల్‌ విమానాల చేరికతో భారత్‌పై దుస్సాహసం ప్రదర్శించాలనుకునే వారికి గట్టి సందేశం ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌. ఇటీవల చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఐఏఎఫ్‌ అప్రమత్తంగా వ్యవహరించిన తీరు ఎంతో అభినందించదగినదని చెప్పారు. "జాతీయ భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం. భవిష్యత్తులో యుద్ధాలకు దారి తీసే పరిస్థితులు వస్తే.. వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుంది. మా పరిధుల్లోనేకాక ఇండో-పసిఫిక్‌, హిందూమహా సముద్ర ప్రాంతంలోనూ శాంతికి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటమే భారత్‌, ఫ్రాన్స్‌ దేశాల ప్రధాన అజెండా. ఉగ్రవాదం నుంచి ముప్పును ఏ మాత్రం విస్మరించేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఐఏఎఫ్‌ చీఫ్‌ ఆర్కేఎస్‌ బదౌరియా మాట్లాడుతూ.. "ప్రస్తుత తరుణంలో ఇవి దళంలోకి రావడం మంచి విషయం. ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ విమానాలు పరిస్థితులను అదుపులోకి తేగలవు" అని పేర్కొన్నారు.

కరోనా సంక్షోభ సమయంలోనూ తాను ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నానని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ప్లోరెన్స్‌ పార్లె అన్నారు. "భారత్‌, ఫ్రాన్స్‌కు ఇదో గొప్ప విజయం. రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాల్ని సూచిస్తున్నాయి. భారత దేశానికి ప్రపంచ స్థాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి" అని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి:'రఫేల్' వాయుసేనలోకి చేరే కీలక ఘట్టం నేడే

వాయుసేన 17వ స్క్వాడ్రన్​లో చేరిన రఫేల్

మన 'రఫేల్'​కు అడ్డొస్తే.. వార్​ వన్​ సైడే!

నేడు పీఎంఎంఎస్​వైను ఆవిష్కరించనున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details