ప్రాణాంతక కరోనా వైరస్ దేశంలో కొత్త రూపం దాల్చిందా? ఇదే విషయంపై మధ్యప్రదేశ్లోని ఇండోర్ వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండోర్లో విస్తరిస్తోన్న వైరస్.. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే భిన్నంగా ఉందని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో వైరస్ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉందని అంటున్నారు.
పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి నమూనాలను పంపనున్నట్టు మహాత్మా గాంధీ మెమోరియల్ వైద్య కళాశాల డీన్ జ్యోతి బిందాల్ వెల్లడించారు.
"ఇండోర్లో ఉన్న వైరస్ మరింత ప్రాణాంతకమని మేము భావిస్తున్నాం. ఎన్ఐవీతో ఈ విషయంపై చర్చించాం. వారికి ఇక్కడి నమూనాలను పంపుతాం. వారి వద్ద ఉన్న వైరస్ జీనోమ్తో ఈ నమూనాలను పోల్చి చూస్తారు."
--- జ్యోతి బిందాల్, మహాత్మా గాంధీ మెమోరియల్ వైద్య కళాశాల డీన్.