కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు భారత్, పాకిస్థాన్లు చర్చలు చేపట్టాలని సూచించింది వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్. నియంత్రణ రేఖ వెంబడి ప్రజలను బలిగొంటున్న అర్థరహితమైన రక్తపాతాన్ని ఆపాలని కోరింది.
నియంత్రణ రేఖ వెంబడి భారత్-పాక్ మధ్య శుక్రవారం కాల్పులు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవటంపై విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేసింది మీర్వైజ్ ఉమర్ ఫారూక్ నేతృత్వంలోని సంస్థ.
"భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు పోరాటాన్ని వదిలి జమ్ముకశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి, రక్తపాతాన్ని అంతం చేసేందుకు చర్చలు చేపట్టాలని హురియత్ మరోసారి కోరుతోంది. ఎల్ఓసీ వెంబడి దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో అమాయకపు కశ్మీరీ పౌరులు సహా ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం, సిగ్గుచేటు."