చైనా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌తో ఉన్న సరిహద్దుల్లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ద్వైపాక్షిక చర్చల్లో నిర్ణయం జరిగి రెండు రోజులు గడిచాయో లేదో.. డ్రాగన్ బుసలు మొదలయ్యాయి. సరిహద్దుల్లో భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలకు దిగినట్లు ప్రకటించింది. ఇందులో వేల మంది పారాట్రూపర్లు, యుద్ధ ట్యాంకులు పాల్గొనడం గమనార్హం. భారత్‌కు గట్టి సందేశం ఇవ్వడమే వీటి ఉద్దేశమని ఆ దేశ అధికారిక మీడియా పరోక్షంగా స్పష్టం చేసింది.
సైనిక మోహరింపులు..
తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల సైన్యాల మధ్య దాదాపు నెల రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాలూ పోటాపోటీగా సైనిక మోహరింపులు చేపట్టాయి. వివాద పరిష్కారానికి దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. శనివారం రెండు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ హోదా అధికారుల స్థాయిలో సమాలోచనలు జరిగాయి. సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయనుకున్న తరుణంలో యుద్ధ విన్యాసాల విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్, చైనా సెంట్రల్ టీవీ (సీసీటీవీ)లు ప్రకటించాయి. ఈ అభ్యాసాల కోసం.. మధ్య ప్రావిన్స్ నుంచి భారీగా బలగాలను సరిహద్దుల్లోకి పంపినట్లు పేర్కొన్నాయి. భారత్‌తో సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలోనే వీటిని చేపట్టినట్లు తెలిపాయి. పౌర విమానాలు, రైళ్లను ఉపయోగించి వేల మంది పారాట్రూపర్ సైనికులు, వందలాది ట్యాంకుల, ఇతర సాధన సంపత్తిని విడతలవారీగా తరలించినట్లు పేర్కొన్నాయి. కొద్ది గంటల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లు వివరించాయి.
గతవారం ఇదే తరహాలో..
గత వారం కూడా చైనా సైన్యం ఇదే తరహా విన్యాసం చేపట్టినట్లు గ్లోబల్ టైమ్స్ ఇటీవల ప్రకటించింది. చైనా సైన్యంలోని టిబెట్ మిలటరీ కమాండ్.. రాత్రి వేళ శత్రు భూభాగంలోని పర్వత ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లే విన్యాసాలను చేపట్టినట్లు తెలిపింది. 4700 మీటర్ల ఎత్తులో ఈ అభ్యాసాలు జరిగాయని వివరించింది. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ సామర్థ్యాన్ని తమ సైన్యం పరీక్షించిందని తెలిపింది.