తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్‌' విలువ

కరోనా.. అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి.. దీనిని కట్టడి చేయాలంటే వ్యాప్తిని అడ్డుకోవాల్సిందే. ఒక కరోనా రోగి సగటున ఎంతమందికి ఈ వ్యాధిని వ్యాప్తిచేస్తాడనే విషయాన్ని తెలిపే కొలమానాన్ని 'ఆర్‌' విలువ లేదా 'ఆర్‌నాట్‌' అంటారు. దీన్ని ప్రతివారం లెక్కిస్తారు. 'ఆర్​' విలువ ఎంత ఎక్కువ వస్తే వ్యాధి అంత ఎక్కువ మందికి వ్యాపిస్తోందని అర్థం. ప్రభుత్వాలు లాక్‌డౌన్లు విధించినా.. భౌతిక దూరం నిబంధనలు అమలు చేసేది... ఈ ఆర్‌ విలువను అదపు చేయడానికే.

India's R value dip below to 1
వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్‌' విలువ

By

Published : Sep 25, 2020, 10:20 PM IST

కొవిడ్‌ వ్యాప్తిరేటు ఎక్కువ..?

సాధారణ ఫ్లూ సోకిన ఐదు రోజుల్లోపే లక్షణాలు బయటపడిపోతాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి అప్రమత్తమై చికిత్స తీసుకొంటాడు. దీనికి తోడు వ్యాక్సిన్‌ తీసుకొన్నవారిని, వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారిని ఇది ఏమీ చేయలేదు. ఈ రెండు లేనివారికి మాత్రమే సోకుతుంది. అందుకే దీని వ్యాప్తిరేటు(ఆర్‌నాట్‌) 1.3గా ఉంది. కానీ, కొవిడ్‌లో 14 రోజుల పాటు లక్షణాలు బయటపడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. దీని వ్యాప్తిరేటు 2-2.5గా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు వారాలపాటు వ్యాధిగ్రస్తుడు పలువురికి దీన్ని అంటిస్తాడు. పైగా కొవిడ్‌కు ఎటువంటి వ్యాక్సిన్‌ లేకపోవడం, ప్రజల్లో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందకపోవడంతో రోగి పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరికి సోకే ప్రమాదం ఉంది.

సాధారణ ఫ్లూ వ్యాప్తిరేటు 1.3 అనుకుంటే. పది దశలు దాటాక అది 56 మందికి సోకే అవకాశం ఉంది. అదే కొవిడ్‌-19 వ్యాప్తిరేటు కనిష్ఠంగా 2 అనుకుంటే పది దశలు దాటాకా 2047 మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.

ఈ వారం తగ్గుదల..

చెన్నైలోని 'ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాథమేటికల్‌ సైన్స్‌' లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఈ వారం ఆర్‌ విలువ 0.93గా నమోదైంది. గత వారం ఇదే విలువ 1.08గా ఉంది. ముఖ్యంగా కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటకలో కూడా ఈ విలువ 1 కంటే తక్కువకు రావడం ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడి కొవిడ్‌ వ్యాప్తిలో తగ్గుదల నమోదైంది. భారత్‌లో కరోనావ్యాప్తి మొదలైన తర్వాత ఇంత తక్కువ ఆర్‌విలువ ఎప్పుడూ నమోదు కాలేదు.

తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో ఇలా..

  • ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌విలువ 0.95 నుంచి 0.80కు తగ్గింది. తెలంగాణలో ఇది 0.94 నుంచి 0.92కి చేరింది.
  • ఈ వారం మహారాష్ట్రల్లో ఆర్‌ విలువ 0.86గా నమోదైంది. గత వారం ఇది 1.17గా ఉంది.
  • కర్ణాటకలో గత వారం ఆర్‌విలువ 0.95గా నమోదు కాగా... ఈ సారి అది 0.80కు తగ్గింది.
  • తమిళనాడులో మాత్రం ఈ విలువ పెరగింది. గత వారం 0.93గా ఉండగా.. ఈ సారి అది 0.99కు చేరింది.
  • ఇక ఉత్తర్‌ ప్రదేశ్‌లో 1.10 నుంచి 0.91కు తగ్గింది.
  • ఒడిశాలో 1.11 నుంచి 1.04కు చేరింది.
  • పంజాబ్‌లో 1.16 నుంచి 1.07కు పడిపోయింది.
  • కేరళలో వ్యాప్తి రేటు పెరిగింది. ఇది 1.07 నుంచి 1.20కు వచ్చింది.

అక్కరకొస్తున్న పరీక్షలు..

భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగిని ముందుగానే గుర్తించడంతో వ్యాప్తి కొంత తగ్గింది. దీనికి తోడు అత్యవసర చికిత్సకు వాడే ఔషధాలు కూడా అందుబాటులోకి రావడంతో ఒక వ్యక్తిలో ఎక్కువ రోజులపాటు ఈ వ్యాధి ఉండటం లేదు. అంటే అతను ఇతరులకు వ్యాధిని అంటించే అవకాశాలు కూడా ఆమేరకు తగ్గినట్లే.

నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 14లక్షల 92వేల పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో 86,052 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 58,18,570కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో గడిచిన 24గంటల్లో 81వేల మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

వ్యాధి అంతం ఇలా..

అంటు వ్యాధులను కనుమరుగు చేయడానికి కొంతకాలం పాటు ఆర్‌ విలువను 1కంటే తక్కువగా ఉంచడం చాలా అవసరం. భారత్‌ వంటి జనసాంధ్రత ఉన్న దేశాల్లో ఇది చాలాకష్టం. కానీ, ప్రస్తుతం భారత్‌లో రికవరీలు వేగంగా పెరగడం.. ఆర్‌ విలువ తగ్గడంతో వ్యాధిపై మెల్లగా పట్టు సాధిస్తున్నాం. కొంత కాలం పాటు ఆర్‌ విలువను 1కంటే తక్కువగా ఉంచగలిగితే ఈ వ్యాధి అదృశ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, అది అంత తేలిగ్గా సాధ్యమయ్యే విషయం కాదు. దిల్లీలో దాదాపు నెల రోజులు ఆర్‌ విలువను 1కంటే తక్కుగా ఉండేట్లు చేశారు. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details