దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,079 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 16,38,871కు పెరిగింది.
కరోనా బారిన పడి ఒక్కరోజులో 779 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 35,747కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మరణాల్లో ఐదో స్థానానికి..
దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 700లకుపైగా కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నాటికి దేశంలో 35,747 కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానానికి చేరింది. 35,132 మరణాలతో ఇటలీ ఆరో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, మెక్సికో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
రికవరీ రేటు 64.54 శాతం..
దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 10లక్షల 57వేల మంది కోలుకున్నారు. మరో 5లక్షల 45వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.54శాతం ఉండగా, మరణాల రేటు 2.18శాతంగా ఉంది.
6 లక్షల పరీక్షలు..
కరోనాపై పోరులో భాగంగా నిర్ధరణ పరీక్షల్లో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. ఒక్కరోజులో 6 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.