దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజులోనే సుమారు ఏడువేల మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. మే 1న వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు నడపడం, తర్వాత వారంలోనే విదేశాల్లోని భారతీయులను తీసుకురావడం కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు వల్ల.. వైరస్ బాధితుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
మూడు రెట్లు అధికంగా
ఇదే సమయంలో మృతుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 4వేల మార్కును దాటింది. కోలుకున్నవారి సంఖ్య 6 రెట్లు ఎగబాకింది. ప్రస్తుతం 60 వేలు మంది కోలుకున్నారు.
వారి రాకతో..
దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. బిహార్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వలస కార్మికులు.. స్వస్థలాలకు చేరుకోవడం వల్ల కేసుల సంఖ్య 10రెట్లు పెరిగిందని వైద్య నిపుణులు తెలిపారు.