దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా పెరుగుతున్నా.. రికవరీ రేటు అంతే స్థాయిలో నమోదవుతోంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 30 లక్షలు దాటింది. వరుసగా ఎనిమిదో రోజు 60 వేలకు పైగా రికవరీలు నమోదయ్యాయి. ప్రస్తుతం రికవరీ రేటు 77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. కేంద్రం చేపట్టిన టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం వల్లే కరోనా మరణాల రేటు తగ్గిందని స్పష్టం చేసింది.
"మరణాల్లో ప్రపంచ సగటు కంటే భారత్లో తక్కువగానే మరణాల రేటు ఉంది. ప్రస్తుతం భారత్లో మరణాల రేటు 1.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల్లో రెండు శాతం రోగులు ఐసీయూల్లో ఉంటున్నారు. 3.5 శాతం మందికి ఆక్సిజన్ అవసరం అవుతోంది"
-- కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో కరోనా రికవరీలు 30 లక్షల మార్కు(30,37,151) దాటాయి. శుక్రవారం విడుదలైన లెక్కల ప్రకారం.. 24 గంటల్లో 66,659 మంది కోలుకున్నారు. వరుసగా ఎనిమిదో రోజు 60 వేలకు పైగా రికవరీలు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో దాదాపు 77.15 శాతం మంది కోలుకుంటున్నారు.
టెస్టింగ్ సామర్థ్యం పెంపు...
గత కొన్నిరోజులుగా భారత్లో టెస్టింగ్ సామర్థ్యం పెంచినట్లు తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. గత రెండు రోజుల్లోనే దాదాపు 11.70 లక్షల టెస్టులు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు 4 కోట్ల 66 లక్షలకు పైగా టెస్టు చేసినట్లు తెలిపారు అధికారులు. ప్రతిరోజు చేసిన టెస్టుల్లో పాజిటివిటీ రేటు 7.5 శాతానికి తక్కువగానే నమోదు అవుతున్నట్లు స్పష్టం చేశారు.
దేశంలో తాజా అధికారిక లెక్కల ప్రకారం.. 8,31,124 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 21.11 శాతం. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 39,36,747కు చేరాయి. కొవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 68,472కు చేరింది.