వైరస్ వ్యాప్తి ప్రారంభమమైన తొలినాళ్లలోనే దేశవ్యాప్త లాక్డౌన్ అమలు చేయడం ద్వారా మహమ్మారిని విజయవంతంగా నిలువరించినట్లు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రజల అండతోనే కరోనాపై పోరాడుతున్నట్లు చెప్పారు. భారత సంతతికి చెందిన అమెరికా వైద్యుల సమాఖ్య(ఏఏపీఐ)తో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రసంగించారు మోదీ. కరోనా సంక్షోభ కాలంలో భారత సంతతికి చెందిన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా అందించిన సేవలను కొనియాడారు. భారత ప్రధాని ఏఏబీఐ వార్షిక సమావేశానికి హాజరుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
"ప్రజల సహకారంతోనే భారత్లో కరోనాను నిలువరించడం సాధ్యమైంది. ఇతర దేశాలతో పోల్చితే పరిస్థితి ఇక్కడ మెరుగ్గానే ఉంది. అమెరికాలో ప్రతి 10లక్షల మంది రోగుల్లో 350మంది మృతి చెందుతున్నారు. ఐరోపా దేశాల్లో ఆ సంఖ్య 600కు పైనే ఉంది. భారత్లో మాత్రం పది లక్షల మంది బాధితుల్లో 12 మందే మరణిస్తున్నారు. కరోనా కట్టడిలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల రెండో దేశంలో ప్రజల మద్దతు లేకుండా కరోనాను నియంత్రించడం సాధ్యం కాదు. లాక్డౌన్ విధించి వేలాది మంది ప్రాణాలు కాపాడాం."