భారత్‌లో పది లక్షల జనాభాకు నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉందని కొవిడ్‌పై ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రివర్గ బృందం వెల్లడించింది. శనివారం సమావేశమైన మంత్రివర్గ బృందం.. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితిని వివరించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది.
పది లక్షలకు దేశంలో 2,424 కేసులు నమోదవుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 3,161గా ఉందని మంత్రివర్గ బృందం తెలిపింది. అదేసమయంలో మరణాల సంఖ్య పదిలక్షలకు 44గా ఉండగా.. ప్రపంచదేశాల్లో ఈ సంఖ్య 107.2గా ఉన్నట్లు వెల్లడించింది.
- దేశంలోని యాక్టివ్ కేసుల్లో 73 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు మంత్రివర్గ బృందం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బంగ, ఒడిశా, తెలంగాణ ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది.
- కరోనా వల్ల మరణిస్తున్న బాధితులు 7 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తం మరణాల్లో 81 శాతం మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లోనే నమోదైనట్లు వెల్లడించింది.
- అయితే త్వరలో పండగల సీజన్ రానున్న నేపథ్యంలో మంత్రివర్గ బృందం కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సమావేశాల కోసం మార్గదర్శకాలు
కొవిడ్ నియంత్రణలో భారత్ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల కోసం మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.