కరోనా వైరస్ దేశంలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 242 మంది కరోనాకు బలయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు దేశంలో 7,529 కేసులు నమోదవగా.. వాటిలో 6,634 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 652 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
ముంబయిలో ఒక్కరోజే 189 కేసులు..
మహారాష్ట్రలో కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే.. 187 కొత్తకేసులు నమోదవగా 17 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1761కు చేరింది.
ఒక్క ముంబయిలోనే ఇవాళ 11 మంది కరోనాతో మరణించారు. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1182కి పెరిగింది.
పుణె: ఇవాళ మూడు కరోనా మరణాలు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం మరణాల సంఖ్య 29కి చేరింది.
తమిళనాడులో మరో 58..
తమిళనాడులోని ఈరోడ్‌లో ఇవాళ ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. దీనితో రాష్ట్రంలోని మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. మరోవైపు ఇవాళ 58 మందికి కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 969కి చేరినట్లు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి షణ్ముగం వెల్లడించారు.
గుజరాత్ మరో 54 కొత్త కేసులు
గుజరాత్లో ఇవాళ 54 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం బాధితుల సంఖ్య 432కు పెరిగింది.
ఒడిశాలో 37 యాక్టివ్ కేసులు...
ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 50కి చేరిందని వెల్లడించారు అధికారులు. ఒకరు మరణించగా.. ప్రస్తుతం 37 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. మరో 12 మంది వ్యాధి నుంచి బయటపడ్డారు.
దిల్లీ:దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1069కి చేరగా, మృతుల సంఖ్య 19కి పెరిగింది.