కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలను భారీ సంఖ్యలో చేపడుతున్నారు. కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొవిడ్ టెస్టులను భారీగానే నిర్వహిస్తున్నారు. నిత్యం సరాసరి 11లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన తొమ్మిది రోజుల్లోనే కోటి పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపింది. గత ఆరు వారాలుగా టెస్టుల సంఖ్య తగ్గించలేదని స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 10,75,760 టెస్టులు చేశామని.. దీంతో ఇప్పటివరకు దేశంలో 10కోట్ల 65లక్షల కరోనా టెస్టులను పూర్తిచేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో రోజుకు 15లక్షల టెస్టులు చేసే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.
టెస్టుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా పాజిటివిటీ రేటు 7.54 శాతంగా ఉండగా.. గత తొమ్మిది రోజుల్లో జరిపిన కోటి పరీక్షల్లో పాజిటివిటీ రేటు 4.64శాతం మాత్రమే ఉందని స్పష్టంచేసింది. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో కరోనా బాధితుల రికవరీ రేటు 90శాతం దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 7.51శాతం మాత్రమే క్రియాశీల కేసులున్నాయి.
2వేలు దాటిన టెస్టింగ్ కేంద్రాలు..
దేశంలో వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది. జనవరి 23వరకు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ కేంద్రం ఉండగా మార్చి 23వరకు ఆ సంఖ్య 160కు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 2018 కేంద్రాలకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 1127 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా, 981 ల్యాబ్‌లు ప్రైవేటు ఆధ్వర్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. వీటి ద్వారా నిత్యం 15లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించే సామర్థ్యం ఉంది.